దరఖాస్తుల పల్లి

20 Jul, 2016 17:01 IST|Sakshi
దరఖాస్తుల పల్లి

రేగోడ్‌ : కొన్ని దశాబ్దాల క్రితం జమీందారులకు వందల ఎకరాల్లో భూములు ఉండేవి. పట్టాభూములు, సీలింగ్‌ భూములతో దొరలుగా చలామణి అయ్యేవారు. ఈ భూములను తమకివ్వాలంటూ పేద ప్రజలు దరఖాస్తులు చేసుకునే వారు. ఈ క్రమంలో ఆ గ్రామం దరఖాస్తుపల్లిగా పేరు నిలిచిపోయింది.

వివరాల్లోకి వెళితే.. రేగోడ్‌ మండలం ఉసిరికపల్లి గ్రామ పంచాయతీలో దరఖాస్తుపల్లి ఉంది. టేక్మాల్‌ గ్రామానికి చెందిన ఖాదర్‌బాషా సోదరులు నలుగురు. సుమారు వందేళ్ల క్రితం దరఖాస్తుపల్లి శివారుల్లోని ప్రాంతాల్లో వీరిలో ఒక్కొక్కరికి వందల ఎకరాల భూమి ఉండేదని పూర్వికులు చెప్తున్నారు.

నలుగురు అన్నదమ్ముల్లోని ఒకరైన ఖాదర్‌బాషాకు దరఖాస్తుపల్లి ప్రాంతంలో సుమారు 760 ఎకరాల భూమి ఉండేదని తెలిపారు. మొదట్లో ఇక్కడ ఐదారుగురు గుడెసెలు వేసుకునే జీవించే వారు. ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చిన మరికొందరు గుడెసెలు వేసుకుని నివసించే వారు.

ఈ క్రమంలోనే జమీందారు ఖాదర్‌బాషా.. దరఖాస్తుఖేడ్‌గా పేరును పెట్టారట. ఆ తరువాత తమకు సీలింగ్‌ భూములు ఇప్పించాలని దరఖాస్తులు చేసుకునేవారట. ఇక అందరూ దరఖాస్తుపల్లి అంటూ పిలుచుకున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో కూడా ప్రస్తుతం దరఖాస్తుపల్లి అనే ఉంది. ఈ గ్రామంలో సుమారు వంద ఇళ్లు, 260 మంది ఓటర్లు, 600 జనాభా ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. దరఖాస్తుపల్లిలో అందరూ వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.

సీలింగ్‌ భూముల కోసం దరఖాస్తులు
 చాలా ఏళ్ల కిందట దొరలకు వందల ఎకరాల భూములు ఉండేవి. సీలింగ్‌ భూములు ఇవ్వాలని ప్రజలు దరఖాస్తులు చేసేవారు. దీంతోనే దరఖాస్తుపల్లి గ్రామంగా పేరు పొందింది. – తలారి బాలయ్య, దరఖాస్తుపల్లి

ఇంకా దరఖాస్తులు చేస్తూనే ఉన్నాం
నాడు దరఖాస్తులు చేస్తూ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దరఖాస్తులు చేయడంతోనే దరఖాస్తుపల్లి గ్రామంగా పేరుగాంచింది. నాటినుంచి నేటివరకూ గ్రామాస్తులు సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు చేస్తూనే ఉన్నా సమస్యలు పరిష్కారం కావడం లేదు.  – సూర్‌రెడ్డి అడ్వకేట్, ఉసిరికపల్లి

మరిన్ని వార్తలు