ఆ ఆహారంపై ప్రకటనలివ్వండి

25 Oct, 2015 04:33 IST|Sakshi

 హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార కల్తీపై సర్కారుకు హైకోర్టు సూచన
 
 సాక్షి, హైదరాబాద్: ఎక్కడైతే ఆహార కల్తీ జరిగినట్లు తేలుతుందో.. ఆ హోటల్, రెస్టారెంట్లలోని ఆహారం తినేందుకు ఎంతమాత్రం పనికిరాదంటూ పత్రికాముఖంగా ప్రకటన రూపంలో ప్రజలందరికీ తెలియచేయాలని రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. అంతేగాక ఆహార కల్తీకి పాల్పడినవారి ట్రేడ్ లెసైన్స్‌ను సైతం రద్దు చేయాలని స్పష్టం చేసింది. అప్పుడే ఆహార కల్తీకి కొంతమేరకు అడ్డుకట్ట వేయగలుగుతామని అభిప్రాయపడింది. ఆహార కల్తీని అరికట్టేందుకు ప్రస్తుత చట్టాలు ఏం చెబుతున్నాయి? మీరెటువంటి చర్యలు తీసుకుంటున్నారు.. తీసుకోబోతున్నారు.. తదితర వివరాల్ని తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తదుపరి విచారణను వచ్చేనెల 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులిచ్చింది. విశాఖపట్నం మహానగర పాలక సంస్థ(జీవీఎంసీ) పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, వీధుల్లో అమ్ముతున్న తినుబండారాలపై అధికారుల పర్యవేక్షణ లోపించిందని, ఆహారం కల్తీపై అధికారులు పట్టించుకోవట్లేదంటూ న్యాయవాది ఐ.ఎం.అహ్మద్ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల మరోసారి విచారించింది.

మరిన్ని వార్తలు