కార్డుందా.. రైట్ రైట్

26 Feb, 2017 23:34 IST|Sakshi
కార్డుందా.. రైట్ రైట్
  • జోరుగా ఇసుక అక్రమ రవాణా
  • మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారగణం
  • చక్రం తిప్పుతున్న అధికారపార్టీ నేత
  • ఇసుక రవాణా విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇసుక రీచ్‌ల నిర్వహణను రద్దు చేసి ఉచితంగా ఇసుక తీసుకువెళ్లాలని తీసుకున్న నిర్ణయం అధికారపార్టీ వారికి కాసులు కురిపిస్తోంది. ఇది వారి అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అక్రమార్కులు నిత్యం లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు.

    సోమశిల(ఆత్మకూరు): కార్డుల పేరుతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా అటు పోలీసు అధికారులు, ఇటు రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇసుక అక్రమ రవాణాకు మండలంలోని అధికారపార్టీ నాయకుడి అండదండలు ఉండడంతో అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అనంతసాగరం మండల పరిధిలో రెండు ఇసుకరీచ్‌లు ఉన్నాయి. అందులో ఒకటి పీకేపాడు కాగా, రెండోది లింగంగుంట ఇసుక రీచ్‌. లింగంగుంట ఇసుక రీచ్‌లో గ్రామస్తులు అడ్డుకోవడంతో ప్రస్తుతం రవాణా సాగడం లేదు.

    మండలంలోని పడమటి కంభంపాడు ఇసుక రీచ్‌ నుంచి ప్రకాశం జిల్లా మార్కాపురం, బెస్తవారిపేట, కంభం తదితర ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా సాగుతోంది. రోజూ 150 నుంచి 200 ట్రాక్టర్లలో ఇసుక బద్వేల్‌ వరకు తరలుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇసుక రవాణా మొత్తం అక్రమంగానే సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ విధించిన నిబంధనల కన్నా ఇసుకను అధికంగా లోడ్‌ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. రోజూ వేలాది రూపాయలు దండుకొంటున్నారు. స్థానిక రెవెన్యూ, రవాణా ఇతర శాఖలకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని తెలుస్తోంది.

    ట్రాక్టర్లకు నెల కార్డులు
    ఈ ప్రాంతంలో ఇసుక రవాణాకు సంబంధించి ఒక్కో ట్రాక్టరుకు నెలకు రూ.2000 చెల్లించాలనే అక్రమ నిబంధన నెల కార్డుల పేరుతో ఉండడంతో ట్రాక్టర్ల డ్రైవర్లు సైతం అధికంగా ఇసుకను అక్రమంగా లోడ్‌ చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇసుక రవాణా చేసేందుకు పత్రాలు సక్రమంగా ఉన్నా లేకపోయినా ఆత్మకూరు రవాణా శాఖ అధికారికి రూ.1500, మర్రిపాడు పోలీసులకు రూ.2000, వైఎస్సార్‌ జిల్లా బద్వేల్‌ పోలీసులకు రూ.2500, రవాణా శాఖ వారికి రూ.1500, పోరుమామిళ్ల పోలీసులకు రూ.1500 నెల కార్డులకు సమర్పించుకుంటే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకునే వారు ఉండరని సమాచారం.

    చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేత
    ఇసుక అక్రమ రవాణాకు మండలంలోని అధికారపార్టీ నాయకుడి అండదండలు ఉండడంతో అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలుస్తోంది. ఆయన ఇసుక అక్రమ రవాణా చేస్తున్న తన అనుచరగణానికి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపకుంటే కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది.

    అక్రమ రవాణాపై చర్యలు చేపడతాం
    పీకే పాడు ఇసుక రీచ్‌ నుంచి అధిక లోడుతో ఇసుక తరలుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. దానిపై దృష్టి సారించి చర్యలు చేపడతాం.
     ఎంసీ కృష్ణమ్మ, తహసీల్దార్, అనంతసాగరం

మరిన్ని వార్తలు