ఫ్యూజు పోతే చీకటే!

11 Jul, 2017 23:53 IST|Sakshi
అమడగుంట్ల గ్రామంలో లైన్‌మన్‌ లేక ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ ద్వారా పనులు చేయించుకుంటున్న దృశ్యం
– 416 గ్రామాల్లో విద్యుత్‌ సిబ్బంది కరువు
– గ్రామీణ, మండల కేంద్రాల్లో పనిచేసే వారికి కర్నూలులో పోస్టింగ్‌
– రాయకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు
- నేడు సీఎండీ కర్నూలుకు రాక
 
కర్నూలు (రాజ్‌విహార్‌): 
  • కోడుమూరు మండలం అమడగుంట్లలో  సింగిల్‌ ఫేస్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఇటీవల రాత్రి 8.15 గంటలకు ఫ్యూజు కాలిపోయి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వెంటనే ఫ్యూజ్‌ వేసే లైన్‌మన్‌ లేక  గ్రామస్తులు రాత్రంతా చీకట్లో ఉన్నారు.  
  •  గూడూరు మండలం బురాన్‌దొడ్డికి వచ్చే 11కేవీ వ్యవసాయ విద్యుత్‌ ఫీడర్‌ ట్రిప్‌ అయింది.  మరమ్మతు చేసే నాథులు లేక రాత్రంతా ఆ గ్రామస్తులు వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకు నోచుకోలేదు. ఇలాంటి సమస్యలు ఈ రెండు గ్రామాల్లోనే కాదు.. జిల్లాలోని 416కు పైగా గ్రామాల్లో ఉన్నాయి. అక్కడ కింది స్థాయి సిబ్బంది లేకపోవడం, ఉన్నవారిని ఇటీవల బదిలీ చేసి.. వారి స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. 
 
దక్షిణప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్‌)లో ఇటీవల జరిగిన బదిలీలు వినియోగదారులకు శాపంగా మారాయి. రాజకీయ ఒత్తిళ్లు, సిబ్బంది పైరవీలు, యూనియన్‌ నాయకుల ఉదాసీనత కారణంగా అడ్డదారుల్లో పోస్టింగ్‌లు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. కోరుకున్న సీటు కోసం కొందరు అధికార పార్టీ నాయకులను ఆశ్రయిస్తే.. మరికొందరు ఏకంగా ఉత్తర్వులు ఇచ్చే అధికారులనే సంప్రదించి పోస్టింగ్‌లు తెచ్చుకున్నారు. వినియోగదారుడే విద్యుత్‌ సంస్థకు ఆదాయ వనరు. నెలనెలా బిల్లులు సక్రమంగా చెల్లిస్తేనే ఉద్యోగులకు జీతభత్యాలు అందుతాయి. అలాంటి  వినియోగదారుడి అవసరాలు, సమస్యలను బదిలీల సమయంలో ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. ఏ సమస్య వచ్చినా వినియోగదారులు గంటలు, రోజుల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది.  కర్నూలు జిల్లా (సర్కిల్‌)లో 54 మండలాల్లోని 920గ్రామాలకు, 615 మజరా గ్రామాలకు విద్యుత్‌ సరఫరా అందుతోంది. వీటిలో 12 లక్షల మంది వినియోగదారులు ఉండగా.. 1.50లక్షల వ్యవసాయ కనెక‌్షన్లు ఉన్నాయి. వీరి నుంచి ప్రతి నెలా రూ.100 కోట్ల వరకు సంస్థకు బిల్లుల రూపంలో వస్తోంది.  
 
416 గ్రామాల్లో సిబ్బంది లేరు 
 జిల్లాలో 416కు పైగా గ్రామాల్లో సంస్థకు చెందిన రెగ్యూలర్‌ సిబ్బంది లేరు. ఇటీవల జరిగిన బదిలీల్లో పల్లెల్లోని సిబ్బందికి జిల్లా, రెవెన్యూ కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. కొందరికి డీఈలు, మరి కొంత మందికి ఎస్‌ఈ ఉత్తర్వులిచ్చారు. అసలే 250కి పైగా గ్రామాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పైగా బదిలీలు జరిగాయి. దీంతో కర్నూలు డివిజన్‌లోని 15 సెక‌్షన్ల (ఏఈ పరిధిలోని మండలం)లో 92 గ్రామాల పరిధిలో ఒక్కరు కూడా సిబ్బంది లేరు. అలాగే నంద్యాల డివిజన్‌లోని 17 సెక‌్షన్ల పరిధిలో గల 121గామాల్లో, ఆదోని డివిజన్‌లో 126, డోన్‌లో 52 గ్రామాల్లో ఒక్క లైన్‌మన్‌ లేదా జూనియర్‌ లైన్‌మన్‌ కూడా లేరని తెలుస్తోంది. అసలు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఖాళీలు లేకపోయినా ‘ఎనీ ప్లేస్‌ ఇన్‌ కర్నూలు ఆర్‌ టౌన్‌’ అని ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
 
సమస్య వస్తే చీకట్లే
నిబంధన ప్రకారం విద్యుత్‌ సరఫరా (డిస్ట్రిబ్యూషన్‌) ఉన్న ప్రతి గామానికి ఒక లైన్‌మన్‌ (రెగ్యులర్‌) లేదా జూనియన్‌ లైన్‌మన్‌ ఉండాలి. అయితే, 416గ్రామాల్లో  ఫ్యూజ్‌ పోయినా, బ్రేక్‌ డౌన్‌ అయినా, ఫీడర్‌ ట్రిప్పింగ్, జంపర్ల కటింగ్, ఎగ్జిఫ్యూజ్‌ పోవడం వంటి సమస్యలు ఏర్పడినా పట్టించుకునే నాథులే లేరు.
 
నేడు సీఎండీ  రాక
ఎస్పీడీసీఎల్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ హెచ్‌.వై. దొర బుధవారం కర్నూలుకు రానున్నారు. ఉదయం జిల్లా కేంద్రానికి చేరుకొని స్థానిక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. విద్యుత్‌ భవన్‌లోని సమావేశపు హాలులో ఉదయం 10గంటలకు సమీక్ష ప్రారంభం కానుంది. సీఎండీతో పాటు డైరెక్టర్‌ పి.పుల్లారెడ్డి కూడా హజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు.
 
మరిన్ని వార్తలు