పనితీరు మార్చుకోకపోతే చర్యలు

29 Apr, 2017 21:41 IST|Sakshi
పనితీరు మార్చుకోకపోతే చర్యలు
 కలెక్టర్‌ ఎస్‌. సత్యనారాయణ
–పత్తికొండ, తుగ్గలి అధికారులపై ఆగ్రహం
 
కర్నూలు (వైఎస్‌ఆర్‌ సర్కిల్‌):  వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో పురోగతి అధ్వానంగా ఉందని, అధికారులు పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ హెచ్చరించారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయ సమావేశ భవనంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీర్లతో పాటు పలుశాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం నీరుగారిపోతుందని అసహనం వ్యక్తం చేశారు.  పత్తికొండ, తుగ్గలి మండలాల్లో సున్నా శాతం పనితీరు కనబరచడంతో ఆయన అధికారులపై మండిపడ్డారు. వారంలోపు 20 శాతం పురోగతి కన్పించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 
 
 నీటి ఎద్దడిని నివారించండి..
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయని, గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రధానంగా సమస్యాత్మక గ్రామాలను గుర్తించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. నాన్‌ సీఆర్‌ఎఫ్, ఎస్‌డీపీ నిధులతో ఇటీవల ప్రారంభించిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిధుల వినియోగంతో పాటు పనుల లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. 14వ ఆర్థిక సంఘం నిధులను మంచినీటి పథకాల మరమ్మతులకు వినియోగించుకోవాలని సూచించారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ హరిబాబు, ఈఈలు, డీఈలుపాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు