యంపా, బలరామ్‌లు అనారోగ్యంతో మృతి చెందాయి

18 Sep, 2015 21:02 IST|Sakshi

తిరుపతి మంగళం: తిరుపతి శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల (ఎస్వీ జూపార్క్)లో శుక్రవారం యంపా (22) అనే ఆడసింహం, బలరామ్ (4) అనే తెల్లపులి పిల్ల అకాల మరణానికి కారణం అనారోగ్యమేనని జూపార్క్ క్యూరేటర్ వై.శ్రీనివాసులురెడ్డి తెలిపారు. గతంలో సర్కస్‌ల నుంచి ఎస్వీ జూకు 24 సింహాలను తీసుకొచ్చారని,  వాటిలో యంపా ఒకటని,  మరో 23 సింహాలు కూడా వయసుడిగి పోయాయని వివరించారు. అందులోనూ మిగిలిన 20 సింహాలు వయసుడిగి మృత్యువుకు దగ్గరగా ఉన్నాయన్నారు.

అటవీ ప్రాంతంలో అయితే సింహాలు 16నుంచి 18సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయని, ఎస్వీ జూలో సరైన సమయానికి పౌష్టికాహారం, వైద్యసేవలు అందిస్తుండడంతో మరో నాలుగు సంవత్సరాలు ఎక్కువగా జీవించగలిగాయని పేర్కొన్నారు. ఎస్వీ జూలోనే రణధీర్, హసీనా అనే తెల్లపులులకు జన్మించిన బలరామ్(4) అనే తెల్ల పులిపిల్ల కూడా అనారోగ్యంతో మృతి చెందిందని క్యూరేటర్ తెలిపారు. పది రోజులుగా బలరామ్ లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతూ శుక్రవారం మృతి చెందిందన్నారు. జూలో జంతువుల పరిరక్షణకు డాక్టర్ అరుణ్ వైద్య పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం జూలోనే సింహం, తెల్ల పులి పిల్లకు పోస్టుమార్టం నిర్వహించి, ఖననం చేశారు.

మరిన్ని వార్తలు