బదిలీలైనా చేరని ఉద్యోగులు!

30 Jun, 2016 08:10 IST|Sakshi

 శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేర రెవెన్యూ శాఖలో బదిలీలు జరిగాయి. ఉద్యోగుల్లో సగం మంది బదిలీ స్థానాల్లో చేర లేదు. వీరిలో చాలా మంది బదిలీల మార్పులకు, యథాస్థానంలో కొనసాగేందుకు రాజకీయ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ముడుపులు చెల్లించేందుకు సైతం కొందరు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
 
 అధిక సంఖ్యలో బదిలీ జరిగిన వీఆర్వోలు మాత్రమే విధుల్లో చేరారు. బదిలీల ప్రక్రియ జూన్ 20తో ముగిసింది. 24వ తేదీవరకు సర్దుబాటు ప్రక్రియ నిర్వహించారు. బదిలీ స్థానాల్లో చేరాలని ఉత్తర్వులు జారీచేసి వారం రోజులు కావాస్తున్నా పలు కేడర్లులో ఉద్యోగుల చేరలేదు. ప్రతిరోజు అధికార పార్టీకి చెందిన నాయకుల ప్రతినిధులు  కలెక్టరేట్‌కు రావడం, దగ్గరుండి మార్పులు చేయించుకుంటుండం విమర్శలకు తావిస్తోంది. కొందరు ఉద్యోగులు దీనిని వ్యతిరేకిస్తున్నారు.
 
  వీఆర్వోలు 108 మంది బదిలీలు కోరుకుంటే 90 మందికి పైగా కొత్త స్థానాలకు బదిలీ అయ్యారు. వీరిలో ఇంచుమించుగా అందరూ విధుల్లో చేరారు. డిప్యూటీ తహశీల్దారు కేడరులో 34 మందికి బదిలీలు చేసినా, సగం మంది కూడా కొత్త స్థానాల్లో చేరలేదు. నరసన్నపేట ఎంఎల్‌ఎస్ పాయింట్, పాలకొండ, రణస్టలం సూపరెంటెండెంట్‌లు, కోటబోమ్మాళి డీటీ... ఇలా చాలా మంది బాధ్యతల స్వీకరణకు వెనుకంజ వేస్తున్నారు. ఈ కోవలోనే సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు.
 
  బదిలీల్లో భాగంగా రెవెన్యూ పర్యవేక్షకుల పోస్టులను కూడా నియమించాలని ఉన్నతాధికారులు జాబితాలు సిద్ధంచేశారు. శాఖాపరమైన సమస్యలు ఉత్పన్నం కావడంతో మరో మూడు నెలల వరకు సమయం పట్టవచ్చని కార్యాలయం భోగట్టా.
 
 కలెక్టరేట్ కు వచ్చేందుకు వెనుకడుగు...
 కలెక్టరేట్‌కు వచ్చేందుకు ఉద్యోగులు వెనుకాడుతున్నారు. కలెక్టరేట్‌లో పనిభారం ఎక్కువగా ఉండడం, ప్రతి క్షణం ఉన్నతాధికారులు దగ్గరలో ఉండడంతో ఇబ్బందులు వస్తాయని భయపడుతున్నారు. కలెక్టరేట్‌లో కొన్ని సీట్లలో పనిచేసిన వారు రాత్రి ఎనిమిది గంటల వరకు ఉండాల్సి రావడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ఇటీవల జేసీ ప్రత్యేక శ్రద్ధతో వివిధ మండలాల నుంచి మూడు కేడర్ల ఉద్యోగులు 18 మందిని కలెక్టరేట్‌కు బదిలీలపై తీసుకువచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు వీరిలో సగం మంది మాత్రమే విధుల్లో చేరారు.
 
 ఏఓ స్థానం ఖాళీ...
 కలెక్టరేట్‌లో ఎ-సెక్షన్ సూపరింటెండెంట్ పరిపాలనాధికారిగా వ్యవహరిస్తారు. ఇక్కడ పనిచేస్తున్న కాళీప్రసాద్‌ని బదిలీ చేశారు. ఈ స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఈ పోస్టులో పనిఒత్తిడి ఉండడంతో కొంతమంది రావాడానికి ఇష్టపడటం లేదు. కొత్తవారు, ఇటీవల రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన వారు ఈ సీటులో ఉంటే న్యాయం జరుగుతుందని రెవెన్యూ ఉద్యోగులు భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు