సైనా మళ్లీ పతకం గెలవొచ్చు

30 Jun, 2016 00:01 IST|Sakshi
సైనా మళ్లీ పతకం గెలవొచ్చు

బ్యాడ్మింటన్ దిగ్గజం  ప్రకాశ్ పదుకొనే విశ్వాసం

 

ముంబై: వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌కు పతకం గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనే అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సైనా ఆటతీరులో వైవిధ్యం కనిపిస్తోందని... ఇదే తరహా ఆటను ఆమె రియో ఒలింపిక్స్‌లోనూ ప్రదర్శిస్తే పతకం రావడం ఖాయమని ఆయన అన్నారు. లండన్ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌లో కాంస్యం నెగ్గిన సైనా... ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని ఈ మాజీ నంబర్‌వన్ ప్లేయర్ విశ్వాసం వ్యక్తం చేశారు.


‘సైనా ఆటలో వైవిధ్యం కనిపిస్తోంది. గతంలో ఆమె ఆటతీరును ప్రత్యర్థులు తొందరగానే అంచనా వేసేవారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం నెట్ గేమ్ ఎక్కువగా ఆడుతోంది. ఒక వ్యూహం విఫలమైతే మరో వ్యూహాన్ని అమలు చేస్తూ ఫలితాలు సాధిస్తోంది’ అని ఈ ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ విశ్లేషించారు. ఇటీవల కాలంలో ఎంత మెరుగ్గా ఆడినా... ఒలింపిక్స్ జరిగే సమయంలో కనబరిచే ఆటతీరే పతకావకాశాలపై ప్రభావం చూపిస్తుందన్నారు. ‘ఒలింపిక్స్‌లో గత ప్రదర్శనను లెక్కలోకి తీసుకోలేం. ఆ రెండు వారాల్లో ఎవరైతే తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తారో వారికే పతకాలు వస్తాయి’ అని ప్రకాశ్ పదుకొనే అన్నారు.

 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు