విత్తనం.. గందరగోళం

14 Oct, 2016 00:35 IST|Sakshi
విత్తనం.. గందరగోళం

బయోమెట్రిక్‌తో రైతులకు తప్పని తిప్పలు
నెట్‌వర్క్‌ అందక ఎదురుచూపులు
తోపులాట, తొక్కిసలాటతో ఉద్రిక్తం
రైతులపై లాఠీ ఝళిపించిన కానిస్టేబుల్‌
లింగాల, ఎర్రగుంట్లలో దూసుకొచ్చిన రైతులు

 –వ్యవసాయాధికారులు కొందరిని ముందుగా లోనికి పిలిచి విత్తనాలు అందజేయడంలాంటి ఘటన ఎర్రగుంట్లలో చిచ్చురేపగా....లింగాలలో భారీగా తరలివచ్చిన అన్నదాతలు మాకు ముందంటే మాకు ముందు ఇవ్వాలంటూ ఆందోళనకు సిద్ధమవడంతో విత్తన పంపిణీ నిలిచిపోయింది.
– ఎర్రగుంట్లలో తోపులాట, తొక్కిసలాట జరగ్గా....లింగాలలో వేలాదిమంది రైతన్నలు అరుపులు, కేకలతో వ్యవసాయ కార్యాలయం దద్దరిల్లింది. రెండుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పంపిణీ వాయిదా పడింది.
–రైతుల పేర్ల నమోదులో జాప్యం జరుగుతుండటంతో ప్రొద్దుటూరు వ్యవసాయ కార్యాలయంలోని పంపిణీ కేంద్రం వద్ద మహిళలు ఒకరికొకరు తోసుకున్నారు. కొంతమంది జుట్లు పట్టుకుని కొట్టుకుంటుండగా ఏఓ సాగర్‌కుమార్‌రెడ్డి వారించి వారిని బయటికి పంపారు.
– పెద్దముడియంలో రైతులు తమకు త్వరగా విత్తనాలు ఇవ్వాలని ఏఈవో మహాదేవతో గొడవకు దిగారు. అయితే తను చేసేదేమీ లేదని నిబంధనల ప్రకారం పంపిణీ చేస్తామని చెప్పడంతో రైతులు ఆగ్రహంతో ఏఈవోపై దాడి చేశారు. దీంతో ఏఓ అరుణ గోదాము వద్దకు వచ్చి శనగ పంపిణీని నిలిపివేసి ఎస్‌ఐ ఓబన్నకు సమాచారం అందించింది. తమకు రక్షణ లేకుండ విత్తనాలను పంపిణి చేయలేమని లె గెసి చెప్పారు.
–రాజుపాళెం మండలంలోని రైతులు సబ్సిడీ శనగ విత్తనాల కోసం పడారాని పాట్లు పడుతున్నారు.శనగల కోసం రైతులంతా భారీగా తరలి వచ్చారు. వారంతా ఒకరికొకరు తోసుకోవడంతో గురువారం కూడా పోలీస్‌స్టేషన్‌లోనే కూపన్ల పంపిణీ జరిగింది. ఇది జిల్లాలో శనగ విత్తనాల పంపిణీ తీరు.

సాక్షి, కడప : జిల్లాలో శనగ సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలను విత్తనభయం వెంటాడుతోంది. గంటల తరబడి క్యూలో ఉండలేక....తీరా నిలబడిలోనికి వెళ్లినా వేలిముద్రలు పడక విత్తనాలు చేతికందక రైతన్న కలత చెందుతున్నాడు. గంటల తరబడి నిరీక్షించి కూడా ప్రయోజనం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. జిల్లావ్యాప్తంగా కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, రాయచోటి, బద్వేలు, ముద్దనూరు, ప్రొద్దుటూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో సుమారు 88,400 హెక్టార్లలో శనగ సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. సరిపడ విత్తనాలు కూడా పూర్తిస్థాయిలో అందిస్తారా? లేదా? అన్నది అనుమానంగా మారడంతో రైతులు బారులు తీరుతున్నారు. అందులోనూ ఇప్పుడే అయితే వర్షం పడింది కాబట్టి వెంటనే పదునులో విత్తనడానికి ఆస్కారం ఉంటుంది. ఆలస్యమైతే ఇబ్బందవుతుందని ఎక్కడచూసినా వ్యవసాయశాఖ కార్యాలయాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు.
ఎర్రగుంట్ల, లింగాలలో ఆందోళన
లింగాలలో ఏడు పంచాయతీల రైతులంతా విత్తనాల కోసం రావడం....అందులోనూ 1,500 నుంచి 2,000 మంది వచ్చి తమ గ్రామానికి ముందంటే...తమ గ్రామానికి ముందివ్వాలని పట్టుబట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎవరు ఏం చెబుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో పంపిణీ చేయడం సాధ్యం కాదని నిర్ణయించి వాయిదా వేశారు. ఎర్రగుంట్లలో కూడా కొంతమందికి అనుకూలంగా అక్కడి అధికారి విత్తన సరఫరా చేస్తున్నారని...నిలబడిన రైతులంతా ఒక్కసారిగా దూసుకెళ్లడంతో తోపులాట జరిగి పదుల సంఖ్యలో రైతులు కిందపడిపోయారు. ఒక్కసారిగా దూసుకుపోవడంతో లోపల అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడున్న కానిస్టేబుల్‌ లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. అలాగే రాజుపాలెం మండలంలో కూడా పెద్దఎత్తున రైతులు రావడంతో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంతో అక్కడ కూడా పోలీసుస్టేషన్‌లోనే విత్తన పంపిణీకి శ్రీకారం చుట్టారు.
నెట్‌వర్క్‌ సమస్యలతో విత్తన పంపిణీ ఆలస్యం
బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయడంతో పలుచోట్ల మిషన్లు మొరాయిస్తున్నాయి. నెట్‌వర్క్‌ సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్న నేపధ్యంలో రైతులున్నా విత్తనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎదురుచూస్తూ కాలం గడపాల్సి వస్తోంది. కమలాపురంతోపాటు చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రైతన్నలు క్యూలైన్ల వద్దకు అన్నం తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా రైతన్నలకు శనగ విత్తనాలు తెచ్చుకోవడం గండంగా మారింది.

మరిన్ని వార్తలు