పీతల పెంపకానికి డిమాండ్‌

29 Aug, 2017 23:04 IST|Sakshi
నరసాపురం రూరల్‌:
అంతర్జాతీయంగా పీతల పెంపకానికి మంచి డిమాండ్‌ ఉందని మత్స్యశాఖ డెప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఫణిప్రకాష్‌ అన్నారు. మండలంలోని తూర్పుతాళ్లు చామకూరిపాలెం ప్రాథమిక పాఠశాల వద్ద మంగళవారం రెండో అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. ఇప్పటికే బంగ్లాదేశ్, ఇండియా, థాయ్‌లాండ్, ఫిలిప్పైన్స్‌ తదితర దేశాల్లో పీతల సాగు ప్రాచుర్యం పొందిందన్నారు. మండపీత (సిల్లా సెర్రేట్రా) పెరుగుదల రుచి, మార్కెట్‌ ధర అధికంగా ఉండడం వల్ల పెంపకానికి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. రొయ్యల సాగుకు ప్రత్యామ్నాయంగా పీతల సాగుకు తీరప్రాంత గ్రామాలు అనుకూలమన్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ శ్రమ లేకుండా లాభాలు ఆర్జించవచ్చని వివరించారు. రాష్ట్రంలో పీతల హేచరీని గుంటూరు జిల్లా సూర్యలంకలో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. నీటి నాణ్యత, పీతలు సాగు విధానాన్ని రిటైర్డ్‌ డెప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ రామ్మోహనరావు, ఎంపెడా ఏడీ పట్నాయక్‌  తదితరులు వివరించారు. జిల్లాలో 400 హెక్టార్లలో పీతలు, పండుగప్ప సాగవుతున్నట్టు చెప్పారు. సదస్సులో ఎంపీటీసీ పుచ్చకాయల తిరుపతమ్మ, మత్సశాఖ సహాయ సంచాలకులు ఎ.అప్పలరాజు, రమణకుమార్, అభివృద్ది అధికారులు ఎల్‌ఎన్‌ఎన్‌ రాజు, వి.సత్యనారాయణ, ఏడీ ఏడుకొండలు, ప్రతిభ, ఎంపీఈఏలు, పలువురు రైతులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు