వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత శిల్పాకు లేదు

20 Jun, 2016 08:48 IST|Sakshi
వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత శిల్పాకు లేదు

 పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
 
డోన్ టౌన్:  వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డికి లేదని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. టీడీపీ సర్వసభ్య సమావేశంలో శిల్పా చేసిన ఆరోపణలను బుగ్గన తీవ్రంగా ఖండించారు. ఆదివారం తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శిల్పా కుటుంబానికి రాజకీయ భిక్ష ప్రసాదించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఇది అందరికీ తెలిసిన విషయమేనన్నారు.వైఎస్సార్ హయాంలో శిల్పాకు జిల్లాలో అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం ఆయన మరచిపోయినా.. ప్రజలకు గుర్తుందన్నారు.

మేలును మరచి విమర్శించడం తిన్నింటివాసాలు లెక్కపెట్టడమేనన్నారు. రైతులు, ప్రైవేట్ ఆస్తులను ఆక్రమించడం శిల్పాకు, ఆ పార్టీ నాయకులకు అలవాటేనని.. వీరందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు ఆదర్శమని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మిడిమిడి జ్ఞానంతో అర్థం లేని విమర్శలు చేయడం శిల్పా మానుకోవాలని హితవు పలికారు. పదవితోపాటు శిల్పాకు హుందాతనం పెరగాలి కాని చౌకబారుతనం కాదని ఆయన అన్నారు. శిల్పా రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నష్టమని.. రాజకీయాలేమీ కుంటు పడబోవని బుగ్గన ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికల్లో శిల్పా ఎంత మొత్తుకున్నా టీడీపీ టికెట్ దక్కదన్నారు. విలేకరుల సమావేశంలో డోన్ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు, పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి, పుల్లారెడ్డి, వెంకోబరావ్, ఆర్‌ఈ రాజవర్దన్, దినేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా