ఆ ఇద్దరితో శంకర్ మరో చిత్రం?

20 Jun, 2016 03:12 IST|Sakshi
ఆ ఇద్దరితో శంకర్ మరో చిత్రం?

సెల్యులాయిడ్‌పై అద్భుతాల సృష్టికర్తలలో ఒకరు దర్శకుడు శంకర్. తమిళ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో శంకర్ ఒకరని గంటాపథంగా చెప్పవచ్చు. అందుకే ఆయన వెండితెరకే ఇష్టమైన దర్శకుడుగా మారారు. అంతే కాదు ఆయన్ని జయాపజయాలకు అతీతుడని చెప్పవచ్చు. అలాంటి శంకర్ ఇక చిన్న చిత్రాలకు రూపకల్పన చేయడం సాధ్యం కాదేమో. చాలా కాలంగా ఒక చక్కని ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించాలన్న ఆసక్తిని ఆయన వ్యక్తం చేస్తున్నారు.

అయితే అందుకు అవకాశం లేకపోతోంది. శంకర్ చిత్రం అంటే ఇప్పుడు అద్భుతం, అదరహో లాంటి పదాలకు పర్యాయాలుగా మారిపోయాయి. ఆయన చిత్రాలు 100, 200 దాటి 350 కోట్ల బడ్జెట్ చిత్రాల స్థాయికి పెరిగిపోయాయి. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిస్తున్న 2.ఓ చిత్రం బడ్జెట్ 350 కోట్లు అంటున్నారు.
 
ఇక వాట్ నెక్ట్స్ శంకర్ చిత్రం అన్న ప్రశ్న ఇప్పటి నుంచే తలెత్తడం విశేషం. దానికి సమాధానం కూడా కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఎస్ శంకర్ తదుపరి ఇళయదళపతి విజయ్, విక్రమ్ హీరోగా మల్టీస్టారర్ చిత్రం చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. నిజానికి ఈ చిత్రం 2.ఓ చిత్రానికి ముందే నిర్మాణం జరగాల్సి ఉందని, కొన్ని కారణాల వల్ల వెనక్కు వెళ్లి 2.ఓ చిత్రం ముందుకొచ్చిందనేది కోడంబాక్కమ్ వర్గాల టాక్. చాలా కాలం క్రితం ఒక కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ విజయ్, విక్రమ్‌ల కాంబినేషన్‌లో చిత్రం చేస్తానని బహిరంగంగానే వెల్లడించారు.

ఇదే నిజం అయితే విజయ్ హీరోగా నన్భన్, విక్రమ్ హీరోగా అపరిచితుడు, ఐ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన శంకర్ వీరిద్దర్ని కలిసి చేసే చిత్రం ఇంకెంత భారీగా ఉంటుందో ఊహించుకోండి. ఒకప్పుడు కమలహాసన్, రజనీకాంత్ కలిసి చాలా చిత్రాలు చేశారు. అలాంటి ట్రెండ్ కు శంకర్ మళ్లీ శ్రీకారం చుట్టనున్నారా? ఈ ప్రశ్నకు బదులు దొరకాలంటే 2.ఓ చిత్ర విడుదల వరకూ ఆగాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి