జగ్జీవన్‌ సేవలతో దళితుల అభ్యున్నతి

5 Apr, 2017 22:31 IST|Sakshi
జగ్జీవన్‌ సేవలతో దళితుల అభ్యున్నతి
ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : దేశంలో అణగారిన, దళిత వర్గాల అభివృద్ధికి మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ ఎనలేని సేవలు చేశారని, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. జగ్జీవన్‌రామ్‌ 110వ జయంతిని బుధవారం ఏలూరులోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి ఆళ్ల నాని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉప ప్రధానిగా జగ్జీవన్‌రామ్‌ చేసిన సేవలు తదనంతర కాలంలో వచ్చిన నాయకులకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. అణగారిన వర్గాలకు ప్రత్యేక హక్కులు, చట్టాలు, విధానాలు ఉండాలని భావించి అంబేడ్కర్‌ రాజ్యాంగంలో వీటిని పొందుపరిస్తే అమలు చేయడంలో జగ్జీవన్‌రామ్‌ కీలక ప్రాత పోషించారన్నారు. అంబ్కేర్‌, జగ్జీవన్‌రామ్‌ పోరాటాలే స్ఫూర్తిగా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని నియంతృత్వ పాలనపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. జాతీయ నాయకుల ఆశయాలను నెరవేర్చడానికి వైఎస్సార్‌ సీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 
 
ఆయన మార్గదర్శకులు
సీనియర్‌ నాయకుడు పటగర్ల రామ్మోహనరావు మాట్లాడుతూ దేశంలోనే వెనుకబడిన బిహార్‌ నుంచి దళితుల అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చి ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన జగ్జీవన్‌రామ్‌ ఎందరో దళిత నాయకులకు మార్గనిర్దేశంగా నిలిచారన్నారు. పార్టీ ఎస్సీ సెల్‌ నగర కన్వీనర్‌ మున్నుల జాన్‌ గురునాథ్‌ అధ్యక్షత వహించగా పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి దిరిశాల వరప్రసాద్, జిల్లా నాయకుడు మామిళ్లపల్లి జయ ప్రకాష్, కార్పొరేటర్లు కర్రి శ్రీను, బండారు కిరణ్, నాయకులు వేగి లక్ష్మి ప్రసాద్, పైడి భీమేశ్వరరావు, దుర్గారావు, మహ్మద్‌ ఖైసర్, పల్లెం ప్రసాద్, శిరిపల్లి ప్రసాద్,మట్టా రాజు, బోడా కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో..
స్థానిక ఏపీ ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. సంఘ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ లలిత, ఎం.వెంకటేశ్వరరావు, కె.శ్రీను, ఎల్‌ జయశ్రీ,. టి.రమ్య, సీహెచ్‌ రాఘవ పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు