సంచలన కేసు.. సాగని దర్యాప్తు

28 Jan, 2017 22:41 IST|Sakshi
సంచలన కేసు.. సాగని దర్యాప్తు

- జాస్నవిరెడ్డి ఆత్మ‘హత్య’ కేసులో పోలీసుల ఉదాసీనత
- నిందితులపై చర్యలు తీసుకోవడంలో వైఫల్యం
- భారమంతా బెంగళూరు పోలీసులపై నెట్టేసే యత్నం

=====================================
సంచలనం సృష్టించిన జాస్నవిరెడ్డి ఆత్మ‘హత్య’ కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందా? కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయా? నిందితులను పట్టుకుని చట్టానికి అప్పగించడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా? కేసును బెంగళూరు పోలీసులపై నెట్టేసి అనంతపురం పోలీసులు చేతులు దులుపుకోవాలని చూస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు. ఘటన జరిగి పక్షం రోజులు కావస్తున్నా కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం అందుకు బలం చేకూరుతోంది.
 - అనంతపురం సెంట్రల్‌
--------------------------------------------------------------------
అనంతపురం కొవ్వూరునగర్‌లో నివాసముంటున్న సూర్యప్రతాప్‌రెడ్డి కుమార్తె జాస్నవిరెడ్డి ఆత్మ‘హత్య’ కేసులో నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారి వేధింపులు భరించలేకపోయిన ఉన్నత విద్యావంతురాలైన జాస్నవిరెడ్డి ఈ నెల 16న బెంగళూరులో ఆత్మ‘హత్య’ చేసుకున్న చేసుకున్న సంగతి తెలిసిందే.

తిలా పాపం.. తలా పిడికెడు..
జాస్నవిరెడ్డి కేసులో ‘తిలా పాపం.. తలా పిడికెడు’ చందంగా... వేధించిన అత్తింటి వారు, పంచాయితీ చేసిన పెద్దమనుషులు, న్యాయం చేయాల్సి పోలీసుల పాత్ర ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తమ బిడ్డ ఆత్మ‘హత్య’ కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరించి, నిందితులను తక్షణం అరెస్టు చేసి చట్టానికి అప్పగించాలని జాస్నవిరెడ్డి తండ్రి సూర్యప్రతాప్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

పోలీసులు ముందే స్పందించి ఉంటే...
తమ బిడ్డకు అన్యాయం జరుగుతోందని, ఎలా వేధింపులకు గురవుతోందో రాతమూలకంగా ఫిర్యాదు ఇచ్చినా, తాను అనుభవించిన నరకాన్ని స్వయంగా పోలీస్‌ అధికారులతో మొరపెట్టుకున్నా ఫలితం లేదని సూర్యప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. చివరకు మహిళా పోలీస్‌స్టేషన్, డీఎస్పీలు, ఎస్పీ, డీఐజీ కార్యాలయాల చుట్టూ తిరిగినా కనీస స్పందన లేకపోయిందని వాపోయారు.

ఏడాది కిందట వేధింపులు ప్రారంభమైనప్పటి నుంచి అత్తింటి వారి దురాగతం, పెద్ద మనుషుల ముసుగులో చెలామణి అవుతున్న దుర్మార్గుల నిర్వాకం,  న్యాయం చేయాల్సిన పోలీసులు ఏ స్థాయిలో అలసత్వం వహించారో పూసగుచ్చినట్లుగా 40 పేజీ సూసైడ్‌ నోట్‌లో జాస్నవిరెడ్డి రాసి పెట్టిన అంశాలు కీలకంగా మారాయి. అయితే సూసైడ్‌ నోట్‌లో హేమాహేమీలు ఉండడంతో ఆత్మహత్య జరిగిన తర్వాత కూడా చర్యలు తీసుకోవడంలో పోలీసులు పాత పంథానే అవలంభిస్తున్నారనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. అయితే జాస్నవిరెడ్డి కేసులో ఏ ఒక్కరినీ అరెస్ట్‌ చేయకపోవడం అనుమానాలు, ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. దీనికి కారణం జాస్నవిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడింది బెంగళూరులో కావడమే.

దర్యాప్తు నుంచి తప్పుకునే ఆలోచనలో ‘అనంత’ పోలీసులు
సంచలనం రేకెత్తించిన జాస్నవిరెడ్డి ఆత్మహత్య కేసు దర్యాప్తు నుంచి అనంతపురం పోలీసులు తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు జాస్నవిరెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే జాస్నవిరెడ్డి ఆత్మహత్యకు ముందు ఏడాదిగా జిల్లా పోలీస్‌స్టేషన్లలో జరిగిన పంచాయితీలు, నమోదైన కేసుల విషయం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వరకట్న వేధింపులకు ఉన్నత విద్యావంతురాలు అన్యాయంగా బలైతే పట్టించుకునే దిక్కు లేకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈకేసును అనంతపురం పోలీసు ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు