'ఆ ఒప్పందం వెనుక మతలబు ఏంటి?'

8 Mar, 2016 17:29 IST|Sakshi
'ఆ ఒప్పందం వెనుక మతలబు ఏంటి?'

కరీంనగర్‌: మహారాష్ట్రతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. మహా ఒప్పందం పేరిట తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్‌ చిన్నాభిన్నం చేశారంటూ ఆర్మూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ అనాలోచిత విధానానికి, అహంకారానికి నిదర్శనమంటూ ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను శాశ్వతంగా తాకట్టు పెట్టారంటూ దుయ్యబట్టారు. మహారాష్ట్రతో కుదిరిన తాజా ఒప్పందంతో ఆర్థిక భారంతో పాటు, నీటి హక్కులను కోల్పోతామని చెప్పారు. ఏక పక్షంగా కుదుర్చుకున్న ఒప్పందం వెనుక మతలబు ఏమిటీ? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ నిర్మిస్తే 1800 ఎకరాలు ముంపునకు గురవుతుందని అప్పట్లో అభ్యంతరం తెలిపిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడెలా ఒప్పుకుంటారని సూటిగా ప్రశ్నించారు. అయితే 2012లోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌పై పృథ్వీరాజ్‌ చౌహాన్‌ ఒప్పందం చేసుకుందంటూ ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ మేధావులు, విద్యార్థులు మహా ఒప్పందంపై మేల్కోనాలని జీవన్‌రెడ్డి హితవు పలికారు.

కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మహా ఒప్పందం, ప్రాజెక్ట్‌ల రీ డిజైన్‌పై తెలంగాణ సర్కార్‌ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రెండేళ్లుగా ఏమీ చేయకుండా నిర్లక్ష్యం చేసి తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించడానికి ఒప్పందం కుదుర్చుకుందంటూ విమర్శించారు. మహారాష్ట్ర బీజేపీ, తెలంగాణ టీఆర్‌ఎస్‌లు ప్రజల ప్రయోజనాలను పక్కనబెట్టి స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నాయని శ్రీధర్‌బాబు మండిపడ్డారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు