జోగిపేట బంద్‌ ప్రశాంతం

20 Sep, 2016 20:38 IST|Sakshi
జోగిపేటలో బైక్‌ ర్యాలీ
  • ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ నిర్మాణంపై నిరసన
  • అందోలు నుంచి జోగిపేట వరకు భారీ ర్యాలీ
  • నిర్మాణాన్ని అడ్డుకోవాలని కమిషనర్‌కు వినతి
  • విద్యాసంస్థలు, దుకాణాల బంద్‌
  • జోగిపేట: అందోలు, జోగిపేట పట్టణాల్లో మంగళవారం బంద్‌ ప్రశాంతంగా జరిగింది. అందోలులోని 1141 సర్వే నంబరులో వివేకానంద స్ఫూర్తి కేంద్రం వద్ద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించవద్దంటూ వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌, స్ఫూర్తి కేంద్రం సభ్యులు ఇచ్చిన పిలుపు మేరకు బంద్‌ నిర్వహించారు.

    అందోలు నుంచి జోగిపేట వరకు ద్విచక్రవాహనాలపై ర్యాలీగా జోగిపేట వచ్చి ప్రధాన రహదారుల మీద ఉన్న దుకాణాలను, వాణిజ్య సంస్థలను, వైన్‌షాపులను బంద్‌ చేయించారు. కాషాయ జెండాలతో ఊరేగింపు నిర్వహించి జై శ్రీరాం, జైజై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. విద్యాసంస్థలను ముందు సమాచారం ఇచ్చి బంద్‌ చేయించారు. మధ్యాహ్నం వరకు వాణిజ్య సంస్థలన్నీ బంద్‌ పాటించాయి.

    హిందువులంటే నిర్లక్ష్యమా?
    వివేకానంద స్ఫూర్తి కేంద్రానికి కేటాయించిన స్థలంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును నిర్మించాలనుకోవడం సరికాదని జిల్లా వీహెచ్‌పీ నాయకుడు సుభాష్‌ అన్నారు. మండలంలో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయన్నారు. గతంలో స్ఫూర్తి కేంద్రానికి మూడున్నర ఎకరాలు కేటాయించాలంటూ ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.

    ఉద్దేశపూర్వకంగానే క్యాంపు కార్యాలయాన్ని ఇక్కడే నిర్మిస్తున్నారన్నారు. హిందువులంటే ప్రభుత్వానికి నిర్లక్ష్యంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌నాయకులు, వివేకానంద స్ఫూర్తి కేంద్రం సభ్యులు పాల్గొన్నారు

    నిర్మాణాన్ని నిలిపివేయాలి
    అందోలులోని వివేకానంద స్ఫూర్తి కేంద్రం వద్ద ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును నిర్మించవద్దని కౌన్సిలర్‌ గాజుల నవీన్‌ నేతృత్వంలోని బృందం జోగిపేట నగర పంచాయతీ కమిషనర్‌ యాస్మిన్‌భాష ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తాను పరిశీలిస్తానని ఆమె వారికి హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు