ప్రాణాలు మింగేస్తున్నా పట్టదా..?

12 Dec, 2016 14:33 IST|Sakshi
ప్రాణాలు మింగేస్తున్నా పట్టదా..?
వెచ్చాలకు పోవాలన్నా వాగు దాటాల్సిందే
రోగమొచ్చినా ఎదురీత తప్పదు
ఇప్పటికి నలుగురు ప్రాణాలు వాగుపరం..
శిలాఫలకానికే పరిమితం
కేటాయించిన రూ.25 లక్షలు ఏమైనట్టో?
అడ్డతీగల : నిత్యావసరాలు, విద్య, వైద్యం, మరే ఇతర అవసరాలకైనా గ్రామ పొలిమేరల్లోని కొండవాగు దాటాల్సిందే.  ఈ నిత్య జీవన పోరాటంలో ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. వేటమామిడి పంచాయతీలోని పణుకురాతిపాలెం గ్రామస్తుల దుస్థితి ఇది. ఇక్కడి మొత్తం జనాభా 570 మంది. 325 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామం కన్నేరు (పెద్దేరు) వాగుకు ఆవలి వైపు ఉంది. వర్షాకాలం వస్తే ఈ గ్రామస్తులు ట్యూబుల సాయంతో ప్రమాదకర పరిస్థితుల్లో వాగు దాటి ఆవలి ఒడ్డుకు వెళ్లి వస్తుంటారు. ఐదేళ్ల కాలంలో నలుగురిని ఈ వాగు పొట్టనపెట్టుకుంది. ఐదేళ్ళ క్రితం ఉలెం చిన్నారావు  పింఛను తీసుకోవడానికి వాగు దాటే యత్నంలో ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచాడు. మరో ఘటనలో వివాహ నిశ్చితార్థమై, కొన్నిరోజుల్లో పెళ్లిపీటలెక్కబోతున్న పణుకురాతిపాలెం యువకుడు మామిడి మల్లేశ్‌ రెడ్డి కూలి పని కోసం వాగు దాటబోతూ అందులోపడి చనిపోయాడు. ఇంకో ఘటనలో భవననిర్మాణ కార్మికురాలు ముర్ల చిన్ని అడ్డతీగలలో పనిచేస్తూ తిరిగి స్వగ్రామానికి వెళ్తూ కనుమరుగైంది. నేటికీ ఆమె మృతదేహం జాడ కనపడలేదు. తాజాగా మామిడిలక్ష్మి అనే వృద్ధురాలు పింఛన్‌ సొమ్ము కోసం మంగళవారం వాగులోనికి దిగి నీటి ఉధృతి తట్టుకోలేక కొట్టుకుపోయి మృతిచెందింది. వీరంతా దగ్గర బందువులే కావడం గమనార్హం.
రోప్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని మరచారు
వాగుపై రోప్‌బ్రిడ్జ్‌ నిర్మిస్తామని దాని నిర్మాణానికి రూ.25 లక్షలు కేటాయించినట్లు 2013 చివర్లో అప్పటి అరకు ఎంపీ కిశోర్‌చంద్రదేవ్‌ ఇతర ప్రజాప్రతినిధులు వేటమామిడి వైపు వాగు ఒడ్డునే శిలాఫలకం ప్రారంభించారు. కాలక్రమంలో ఆ శిలాఫలకం శిథిలమైంది. ఇటు అధికారులు అటు పాలకులు ఈవిషయాన్ని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పవర్‌ ప్రాజెక్ట్‌ నీటి వల్ల ఇబ్బంది
పణుకురాతిపాలేనికి ఎగువ నిర్మించిన పవర్‌ప్రాజెక్ట్‌ నుంచి నీటిని ఎటువంటి హెచ్చరికలు చేయకుండా దిగువకు వదలడం వల్ల హఠాత్తుగా నీటి ఉధృతి పెరిగి తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఆ నీటి ఉధృతి వల్లే మంగళవారం మామిడిలక్ష్మి అనే వృద్ధురాలు మృతి చెందింది. ఈ ప్రమాదాల నివారణకు నీటిని వదిలేటప్పుడు హెచ్చరికగా సైర¯ŒS ఏర్పాటు చేయాలంటున్నారు.
మరిన్ని వార్తలు