కవిత్వం సామాజిక అంశాల దర్పణం

23 Aug, 2016 20:57 IST|Sakshi
కవిత్వం సామాజిక అంశాల దర్పణం
విజయవాడ కల్చరల్‌ : 
 కవిత్వం సామాజిక అంశాల దర్పణమని మంత్రి పల్లెరఘనాథరెడ్డి అన్నారు. పుష్కరాల సందర్భంగా తెలుగు రక్షణ వేదిక , భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఐఎంఏ హాల్‌లో సోమవారం ఉదయం కవి సమ్మేళనం నిర్వహించింది. వర్ధమాన, ప్రముఖ కవులు కవయిత్రుల కవిత్వ పఠనం అలరించింది. మంత్రి మాట్లాడుతూ కవిత్వంలో సామాజిక అంశాలు కనిపించినప్పుడే అది సజీవంగా ఉంటుందని అన్నారు. ఏ రాష్ట్రంలో కవులకు కళాకారులకు గౌరవం ఉంటుందో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షుడు పొల్లూరి హరికృష్ణ మాట్లాడుతూ నూతన రాజధానిలో కవులను ప్రోత్సహించటానికి  తెలుగు రక్షణ వేదిక అనేక కార్యక్రమాలు చేపట్టిందని,అందులో భాగంగా కవులకు పుష్కర పురస్కారం అందిస్తున్నామని విరించారు. రంగస్థల నటుడు గుమ్మడి గోపాల తెలుగు రక్షణవేదిక లక్ష్యాలను వివరించారు. డిప్యూటీ కలెక్టర్‌ సూర్యకళ, లయోల కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు, సీనియర్‌ జర్నలిస్ట్, రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్‌ కార్యవర్గ సభ్యుడు సిహెచ్‌.వి.ఎన్‌.శర్మ, పాలపర్తి శ్యామలానందప్రసాద్, సుధారాణి, మందారపు హైమావతి, వలివేటి శివరామకృష్ణతో పాటు పలువురు కవులు, కవయిత్రులు కవిసమ్మేళనంలో పాల్గొన్నారు.మల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీ, రమ్యభారతి సంపాదకుడు చలపాక ప్రకాష్‌లు పర్యవేక్షించారు. 
 
>
మరిన్ని వార్తలు