కొండపల్లి బొమ్మకు కొత్తందం

25 Sep, 2016 18:23 IST|Sakshi
కొండపల్లి బొమ్మకు కొత్తందం
  •  బొమ్మల తయారీ పరిశ్రమకు నిధుల విడుదల
  • మూలనపడిన పరిశ్రమకు ఊతం
  • కొండపల్లి కొయ్యబొమ్మ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ ప్రోత్సాహానికి నోచుకోక నిండా మునిగిన బొమ్మల పరిశ్రమకు ఊతం లభించింది. ఢిల్లీకి చెందిన ఎంపవర్‌ సంస్థ, కేంద్ర ప్రభుత్వం కలిసి కొండపల్లి బొమ్మల తయారీ పరిశ్రమకు రూ.1.75 కోట్ల నిధులు మంజూరు చేశాయి. ఈ డబ్బును సక్రమంగా వినియోగించుకుంటే వందల ఏళ్ల కళకు పునరుజ్జీవం కలుగుతుందని కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

     
    కొండపల్లి (ఇబ్రహీంపట్నం)  : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొండపల్లి బొమ్మల తయారీ పరిశ్రమ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఢిల్లీకి చెందిన ఎంపవర్‌ సంస్థ నేతృత్వంలో కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమ నుంచి కొండపల్లి పరిశ్రమకు రూ.1.75 కోట్ల నిధులు మంజూరయ్యాయిఈ పరిశ్రమ ఇప్పటికే జాతీయస్థాయి జాగ్రఫికల్‌ ఇండికేషన్‌ గుర్తింపు పొందింది. సుమారు 350 కుటుంబాల జీవన మనుగడగా, సమస్యల వలయంలో నెట్టుకొస్తున్న బొమ్మల తయారీ పరిశ్రమకు ఈ పరిణామం ఊరట కలిగిస్తుందంటున్నారు.

    రాజస్థాన్‌ హస్తకళ స్ఫూర్తితో..

    400ఏళ్ల క్రితం కొండపల్లిలో రాచరిక పాలన కొనసాగేది. రాజుల కాలం నాటి భవనాలకు డిజైన్‌ చేసేందుకు రాజస్థాన్‌ నుంచి హస్తకళాకారులు వలస వచ్చారు. రాజులు అంతరించాక బొమ్మల తయారీ పరిశ్రమను జీవనోపాధిగా ఎంచుకుని వారంతా ఇక్కడే స్థిరపడ్డారు. కొండపల్లి అడవుల్లో లభించే తెల్ల పొనుగు చెట్ల నుంచి లభించే చెక్కతో బొమ్మలు తయారుచేసి.. క్రమంగా కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ బొమ్మలు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారు.

    అందని ప్రభుత్వ సాయం

    వందల ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అంతంతమాత్రమే. 2002లో నాబార్డు నుంచి ఒక్కొక్కరికి రూ.2,500 మాత్రమే రుణంగా ఇచ్చారు. అనంతరం లగడపాటి రాజగోపాల్‌ ఎంపీగా రూ.5 లక్షలు, ట్రస్ట్‌ ద్వారా రూ.11.5 లక్షలు మంజూరు చేశారు. పుర పథకంలో బొమ్మల పరిశ్రమ, కాలనీ అభివృద్ధికి రూ.4కోట్లు కేటాయించినా అమలుకు నోచుకోలేదు. గతంలో ఇక్కడ తయారైన బొమ్మలను లేపాక్షి సంస్థ 80 శాతం కొనుగోలు చేసింది. అప్పట్లో వ్యాపారం బాగుండేది. ప్రస్తుతం లేపాక్షి కొనుగోళ్లు నిలిపేసింది. వ్యాపారం మందగించింది. అసోసియేషన్‌ భవనం శిథిలావస్థకు చేరింది. కొండపల్లి అడవిలో పొనుగు చెట్లు అంతరించాయి. ఖమ్మంజిల్లా నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో బొమ్మల తయారీదారులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
     

    రూ.1.75 కోట్లతో చేపట్టనున్న పనులు

    బొమ్మల పరిశ్రమకు పూర్వవైభవం తెచ్చేందుకు లేపాక్షి సంస్థతో కలిసి పరిశ్రమ అభివృద్ధికి రూ.1.75 కోట్లు వినియోగించనున్నారు. ఇందులో రూ.1.45 కోట్లు కేంద్ర గ్రాంటు కాగా, రూ.30లక్షలు డీఆర్‌డీఏ ఇంప్లిమెంట్‌ ఏజెన్సీ గ్రాంటు. బొమ్మల తయారీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్రాలు వినియోగిస్తారు. ఇందుకు హస్త కళాకారుల భాగస్వామ్యం 25 శాతం, ప్రభుత్వ గ్రాంటు 75 శాతం. ముందుగా బొమ్మల తయారీదారులతో అసోసియేషన్‌ ఏర్పాటు, శిథిలావస్థకు చేరిన సంఘ భవనాన్ని పునఃనిర్మించడం, బొమ్మల తయారీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యంత్రాల వినియోగం, అందుకు అవసరమైనlనైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణ æకేంద్రం ఏర్పాటుచేస్తారు. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు ఒక క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిబిటర్‌ను ఏర్పాటుచేస్తారు. నేటితరానికి అనుగుణంగా బొమ్మలు మలిచేందుకు డిజైన్‌ సెంటర్, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు.  20ఏళ్ల పాటు పొనుగు చెట్లు పెంచేందుకు ప్లాంటేషన్‌ ఏర్పాటు, వనసంరక్షణ సమితి సభ్యులకు చేయూత ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇవన్నీ మూడేళ్ల కాలవ్యవధిలో నిర్వహించాలి. అలాగే, ఏపీహెచ్‌డీసీ సంస్థ కొండపల్లి బొమ్మల అభివృద్ధికి రూ.70లక్షలు అదనంగా మంజూరు చేసింది. వీటితో కార్మికులకు పవర్‌ టూల్స్, కమ్యూనిటీ హాల్‌కు కాంపౌండ్‌ వాల్, కాలనీకి ప్రధాన గేటు, ఈడీపీ ప్రోగ్రామ్, నైపుణ్యంతో కూడిన శిక్షణ, ఈడీపీ శిక్షణ ఇస్తారు.
     
     
     
మరిన్ని వార్తలు