భూసేకరణకు నెల రోజుల్లో నోటిఫికేషన్‌

8 Feb, 2017 00:05 IST|Sakshi
– వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఆదేశం
 
కర్నూలు(అగ్రికల్చర్‌): అనంతపురం– అమరావతి ఎక్స్‌ప్రెస్‌ జాతీయ రహదారి మలుపులు లేకుండా నిర్మించేందుకు అవసరమైన భూముల సేకరణ పనులను ముమ్మరం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జాతీయ రహదారి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ రహదారులు మలుపులు లేకుండా నేరుగా వేసేందుకు అవసరమైన పునఃప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
 
 
కర్నూలు జిల్లాలో కొలిమిగుండ్ల, సంజామల, ఉయ్యాలవాడ, ఆళ్లగడ్డ, రుద్రవరం మండలాల్లోని 27 గ్రామాల్లో భూ సేకరణ సర్వే పనులు నెల రోజుల్లో పూర్తి చేసి నోటిఫికేషన్‌ జారీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ను ఆదేశించారు. కర్నూలు నుంచి జేసీ మాట్లాడుతూ..జిల్లాలో దాదాపు 1008.75 ఎకరాల భూమిని సర్వే చేయాల్సి ఉందన్నారు. అలాగే శిరువెళ్ల మండలంలో 13.5 కిలోమీటర్ల రిజర్వు ఫారెస్ట్‌లో 203 ఎకరాల భూమి అవసరం అవుతుందని, ఈ నెల 15లోగా పెగ్‌ మార్క్‌ వేసి సర్వే పనులు ప్రారంభిస్తామని జేసీ వివరించారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో నేషనల్‌ హైవే ఈఈ నాగరాజు, అటవీ శాఖ కన్జర్వేటర్‌ మూర్తి, నంద్యాల, ఆత్మకూరు డీఎఫ్‌ఓలు తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు