కౌలు వేలం తక్షణమే నిర్వహించాలి

23 Jul, 2016 20:05 IST|Sakshi
జిల్లాలో సుమారు 85 ఎకరాల జెడ్పీ వ్యవసాయ భూములు
జెడ్పీ చైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్‌
 
 గుంటూరు వెస్ట్‌:   జిల్లా పరిషత్‌కు చెందిన వ్యవసాయ భూములకు కౌలు వేలం తక్షణమే నిర్వహించాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్‌ కోరారు.  జిల్లాలోని దాచేపల్లి, పిడుగురాళ్ల, అచ్చంపేట, దుర్గి, నూజెండ్ల, కర్లపాలెం, సత్తెనపల్లి, క్రోసూరు, ముప్పాళ్ల, పీవీ పాలెం, తుళ్లూరు, కారంపూడి మండలాల్లో సుమారు 85 ఎకరాల జెడ్పీ వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆయా మండలాలలో కొంతకాలంగా కౌలు వేలం పాటలు నిర్వహించడం లేదు. ఈనేపథ్యంలో ఆయా మండలాల ఎంపీడీవోలతో శనివారం జెడ్పీ కార్యాలయంలోని తన చాంబర్‌లో మండలాల వారీగా వ్యవసాయ భూముల వేలంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. చైర్‌పర్సన్‌ జానీమూన్‌ మాట్లాడుతూ వ్యవసాయ, కమర్షియల్‌ భూములను గుర్తించి ప్రస్తుతం ఉన్న ధరల మేరకు కౌలు వేలంపాటలు నిర్వహించి జెడ్పీ ఆదాయం పెంచాలని సూచించారు. జెడ్పీ ఆస్తులను గుర్తించి, ఆస్థలంలో బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో 57 మండలాల ఎంపీడీవోలు, తహశీల్దార్లతో సంయుక్తంగా జెడ్పీ ఆస్తులపై త్వరలో సమావేశాన్ని నిర్వహిస్తామని  చెప్పారు. 
ఆ ఆదాయాన్ని జెడ్పీకి మళ్లించాలి..
 తుళ్లూరు మండలం నెక్కలులోని జెడ్పీ చెరువు వ్యవహారం సమావేశం దష్టికి వచ్చింది.  చెరువులో ‘నీరు–చెట్టు’ కింద మట్టితవ్వకాలు జరిపినట్లు ఆ మండల ఎంపీడీవో జె.మోహనరావు సమావేశంలో ప్రస్తావించారు. జెడ్పీ చెరువులో తవ్వకాలు చేపట్టిన గ్రామసర్పంచ్‌ దానిపై వచ్చిన ఆదాయాన్ని గ్రామ పంచాయతీకి బదలాయించుకోవడాన్ని తప్పుపట్టారు. ఆ ఆదాయాన్ని జెడ్పీకి జమ చేసేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని జానీమూన్‌  మండల ఎంపీడీవోను ఆదేశించారు. 
రెవెన్యూ రికార్డుల్లో పొందుపరచాలి..
  జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో సోమేపల్లి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ జెడ్పీ ఆస్తులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రెవెన్యూ రికార్డుల్లో పొందుపరచడం ద్వారా ఆక్రమణలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఎంపీడీవోలు తహశీల్దార్లుతో సమన్వయం చేసుకుంటూ జెడ్పీ ఆస్తుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.   సమావేశంలో డిప్యూటీ సీఈవో జి.జోసఫ్‌కుమార్, అక్కౌంట్స్‌ అధికారి సీహెచ్‌.రవిచంద్రారెడ్డి, 12 మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు