కాసులిచ్చుకో.. కబ్జా చేసుకో!

14 Sep, 2017 05:00 IST|Sakshi
కాసులిచ్చుకో.. కబ్జా చేసుకో!

పుల్లంపేట: కంచె చేను మేస్తే కాపాడేది ఎవరు..? ప్రభుత్వ భూములు కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే తమవంతుగా సహకరిస్తున్నారు. కాసులు ఇస్తే ఎటువంటి «ఆధారాలు లేకుండా చేశారు. అసైన్‌మెంటు కమిటీ సిఫార్సు లేకుండా వందలాది ఎకరాల దళితుల భూములను అగ్రవర్ణాల పేర్లతో రికార్డులు మార్చిన ఘనత పుల్లంపేట తహసీల్దార్‌ కార్యాలయానికే దక్కుతుంది. కబ్జాదారులు రాత్రికిరాత్రే గద్దలా వాలిపోతున్నారు. అధికారం అడ్డం పెట్టుకుని జేసీబీలతో చదును చేసి స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకోవడం, కంచెలు ఏర్పాటు చేయడం మండలంలో స్పెషల్‌. ఇలా వందల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. వెనువెంటనే ట్రాన్స్‌కో అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి విద్యుత్‌ కనెక్షన్‌ బిగించుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీతో డ్రిప్‌ పరికరాలు కూడా తెచ్చుకుని ఎంచక్కా పొలాలుగా మార్చుతున్నారు. ఆపైన పంటలు సాగుచేసుకుంటున్నారు.

అనంతరం రూ.లక్షలకు విక్రయిస్తున్నారు. దీనికి రెవెన్యూ అధికారుల పూర్తిసహకారం ఉండటంతో ముళ్లపొదలుగా ఉన్న భూములు పంటపొలాలుగా మారిపోతున్నాయి. వీఆర్వో, సర్వేయర్‌ల సహకారం లేనిదే ఎవరూ ప్రభుత్వభూమిని ఆక్రమించే సాహసం చేయలేడు. ఇదే అదునుగా చేసుకుని కొంతమంది వీఆర్వోలు ప్రభుత్వభూమిని కబ్జా చేసుకో ముడుపులు ఇచ్చుకో అని పూర్తిగా సహకరిస్తున్నారు.

వీఆర్వోల పంట పండింది
బోటిమీదపల్లె గ్రామంలో బినామీ పేర్లతో వందలాది మంది సుదూర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు మండలంలో యథేచ్ఛగా పం టలు సాగుచేసుకుంటున్నారు. తిప్పాయపల్లె సర్వేనంబర్‌ 25లో 70 ఎకరాలకుపైగా ఒకేవ్యక్తి రికార్డులను తారుమారు చేసి పంటలు సాగుచేసుకుంటున్నాడు. పైగా ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణం కూడా మంజూరు చేయించుకున్నాడు. అలాగే ఎటువంటి పంట సాగుచేయకుండా బీడుభూములకు కూడా రుణాలు మం జూరు చేయించుకుని రుణ అర్హత కూడా పొం దారు. మండలంలో గతంలో పనిచేసిన వీఆర్వోలు అనతికాలంలో రూ.కోట్లు సంపాదించారనే ప్రచారం ఉంది. అయితే భూఆక్రమణలు, అవినీతిని ని యంత్రించాల్సిన  ఉన్నతాధికారులు మాత్రం మొక్కుబడిగా పరి శీలించడం, పై అధికారులకు నివేదికలు పం పామనడంతో సరిపెడుతున్నారు. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా తమవంతుగా వారు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారి ప్రత్యేక టీమును ఏర్పాటుచేసి భూఆక్రమణదారులపై విచా రణ చేపట్టి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

ఆక్రమణలపర్వం ఇదిగో..
మండలంలోని రంగంపల్లిలో 592, 607, 609లో 50ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. ఇందులో స్థానిక అధికారపార్టీ నాయకుల హస్తం ప్రత్యక్షంగా ఉంది. అలాగే కొమ్మనవారిపల్లెలో 514 సర్వేనంబర్‌లో 5 ఎకరాలు, 846, 840 సర్వేనంబర్లలో సుమారు 20ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. తిప్పాయపల్లె రెవెన్యూ గ్రామంలో సర్వేనంబర్‌ 25/2లో 5 ఎకరాలు, 25/3లో 5 ఎకరాలు ఎటువంటి అసైన్‌మెంట్‌ కమిటీలు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదుచేశారు. అలాగే 1338 మొదలుకుని 1356 వరకు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు  70 ఎకరాల భూమిని అసైన్‌మెంట్‌ కమిటీ తీర్మానం లేకుం డానే గతంలో పనిచేసిన తహసీల్దార్‌లు కాసులకు కక్కుర్తిపడి ఆన్‌లైన్‌లో నమోదుచేశారు.

అనంతసముద్రంలో సర్వేనంబర్‌ 131లో సుమారు 30 ఎకరాల ప్రభుత్వభూమి దురాక్రమణకు గురైం ది. వత్తలూరు సర్వేనంబర్‌ 884లో 30 ఎకరాల భూమి దురాక్రమణకు గురైం ది. అలాగే తిప్పాయపల్లెలో 1240 నుం చి 1250 సర్వేనంబర్‌ వరకు దళితులభూములు. అయితే అగ్రవర్ణాలకు చెందినవారు వాటి రికార్డులు తారుమారు చేసి ఆన్‌లైన్‌లో తమపేర్లు నమోదు చేసుకున్నారు. 1178/2లో కూడా రికా ర్డులు తారుమారుచేసి ప్రముఖ వ్యాపారవేత్త పేరున ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఆ భూములను అతను రూ.15 లక్షల చొప్పున అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఇలా వందలాది  ప్రభుత్వభూములు దురాక్రమణకు గురవుతున్నాయి.

ఆక్రమణలు వాస్తవమే:
మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ జరిగిన మాట వాస్తవమే. గతంలో వాటిపై చర్యలు తీసుకున్నాం. రాళ్లు, పైపులు తొలగించాం. అయినా కూడా ఆక్రమణదారుల ఆగడాలు ఆగడం లేదు. దీనిపై కలెక్టర్‌కు నివేదిక పంపుతాను. చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
–గౌరిశంకర్, తహసీల్దార్‌

మరిన్ని వార్తలు