ఏప్రిల్‌ నుంచి రైతుమిత్ర గ్రూపులకు రుణాలు

21 Mar, 2017 22:49 IST|Sakshi
ఏప్రిల్‌ నుంచి రైతుమిత్ర గ్రూపులకు రుణాలు
- జిల్లా సహకార అధికారి ప్రవీణ
అమలాపురం టౌన్‌ : వచ్చే ఏప్రిల్‌ నుంచి సహకార సంఘాల్లో జాయింట్‌ లైబిలిటీ గ్రూపుల (జేఎల్‌జీ) ద్వారా రైతుమిత్ర గ్రూపులకు రుణాలు ఇవ్వనున్నామని, ఈలోగా జిల్లాలోని 304 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జేఎల్‌జీ గ్రూపుల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా సహకార అధికారిణి (డీసీవో) టి.పవ్రీణ వెల్లడించారు. జేఎల్‌జీల ఏర్పాటు, రైతు గ్రూపులకు రుణాల బట్వాడా తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు స్థానిక డీసీసీబీ బ్రాంచి కార్యాలయంలో అమలాపురం డివిజన్‌లోని సంఘాల అధ్యక్షులు, సీఈవోలకు మంగళవారం జరిగిన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఇంతకాలం సహకార సంఘాల్లో రైతులకు వ్యక్తిగతంగానే పంట రుణాలు ఇచ్చేవారు, ఇప్పుడు జేఎల్‌జీ విధానంలో రైతులకు కూడా గ్రూపులుగా రుణాలు ఇచ్చే వెసులబాటు అందుబాటులోకి వస్తోంది. డివిజనల్‌ సహకార అధికారి ఎ.రాధాకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సదస్సులో డీసీవో ప్రవీణ పలు సహకార అంశాలపై చర్చించారు. కౌలు రైతులకు కూడా రుణాలు ఇచ్చే విధానాలపై ఆమె సమీక్షించారు. డిజిటల్‌ మెంబరు రిజస్ట్రేషన్‌ (డీఎంఆర్‌)కు సంబంధించి సంఘ సభ్యుల పూర్తి సమాచారం సేకరించాలని ఆమె సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సంఘాలు 50:50 పద్ధతిలో గోదాములు నిర్మించుకునే వెసులబాటును సద్వినియోగం చేసుకోవాలని ప్రవీణ పేర్కొన్నారు. సంఘాల్లో తెల్లకార్డు కలిగిన సభ్యులకు ఆరోగ్య రక్ష ద్వారా బీమా కల్పించాలని సూచించారు. జిల్లా సహకార ఆడిటర్‌ వీవీ ఫణికుమార్‌ సంఘాల్లో ఆడిట్, జేఎల్‌జీపై సంఘాల అధ్యక్షులకు అవగాహన కల్పించారు. జిల్లా సహకార విద్యాధికారి ఆదిమూలం వెంకటేశ్వరరావు, కోనసీమ సహకార సంఘాల అధ్యక్షుల సమాఖ్య అధ్యక్షుడు గోకరకొండ విజయ రామారావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ జిన్నూరి బాబి మాట్లాడుతూ సహకార సంఘాల్లో జేఎల్‌జీ విధానం అమలుపై ప్రసంగించారు.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు