కొండంత అభిమానం

5 Jan, 2017 23:06 IST|Sakshi
కొండంత అభిమానం
జనసంద్రమైన సున్నిపెంట
- ఊరు ఊరే కదిలివచ్చిన వేళ
- రెండు కిలోమీటర్ల రోడ్‌షోకు ఆరు గంటల సమయం
- ప్రతి ఒక్కరికీ ఆప్యాయ పలకరింపు
- దివ్యాంగులను చూసి చలించిన జగన్‌
- నేలపై కూర్చొని యోగక్షేమాల ఆరా
- వృద్ధులకు మనవడిని చూసిన ఆనందం
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర శ్రీశైలం నుంచి ప్రారంభమయ్యింది. గురువారం మధ్యాహ్నం లింగాలగట్టుకు చేరుకున్న జగన్‌కు ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. 2009లో వరదలు వచ్చిన సందర్భంగా తాము గృహాలను కోల్పోయామని.. పక్కా గృహాలు నిర్మించాలని లింగాలగట్టువాసులు జగన్‌ను అభ్యర్థించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని ఆయన హామీనిచ్చారు. అక్కడి నుంచి శ్రీశైలం డ్యామ్‌కు చేరుకున్న ఆయన.. డ్యాంలో నీటి నిల్వ, విడుదల తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని సున్నితంగా ఎండగట్టారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించి, దాదాపు పూర్తి చేసిన ప్రాజెక్టులకు గేట్లు ఎత్తుతూ.. తానే ప్రాజెక్టులను పూర్తిచేసినట్టు బిల్డప్‌ ఇస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు లస్కర్‌ పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులను తానే కడుతున్నానని నమ్మబలుకుతున్నారని.. అయితే నీటి విడుదల విషయంలో మాత్రం ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం అక్కడి నుంచి సున్నిపెంటకు చేరుకున్న ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. దాదాపు 2 గంటల ప్రాంతంలో సున్నిపెంట చేరుకున్న ఆయన సుమారు రెండు కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌ షో సుమారు 6 గంటలు పట్టిందంటే జనం ఏ విధంగా తరలివచ్చారో అర్థమవుతోంది. మరోవైపు ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రతి ఒక్కరూ పోటీపడ్డారు.
 
అభిమానమై తరలిరాగా...
అభిమాన నేత జగన్‌ను చూసేందుకు సున్నిపెంట ఊరు మొత్తం రోడ్డుపైకి వచ్చింది. గుండెల నిండా అభిమానంతో రోడ్డుపైనే గంటల తరబడి నిరీక్షించారు. కాళ్లు లేని ఒక ముసలవ్వ జగనన్నను చూడాలంటూ రోడ్డుపైకి వచ్చింది. ఆ అవ్వను ప్రేమతో పలకరించి.. ఆమె తిరిగి ఇంటికి వెళ్లేందుకు దారి ఇవ్వాలంటూ దగ్గరుండి మరీ ఇబ్బంది లేకుండా చూశారు. అదే విధంగా ఆయనకు రోడ్డు నిండా పూలు చల్లుతూ.. హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ రోడ్‌ షో రాత్రి 8 గంటల వరకూ సాగింది. అనంతరం ఆయన శ్రీశైలానికి చేరుకున్నారు.      
 
సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీపడ్డారు. అభిమాన నేతకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు ఆయన విష్‌ యూ ద సేమ్‌ అంటూ కరచాలనం చేశారు. మరికొందరు వృద్ధులు, వికలాంగులు తమకు పింఛన్లు రావడం లేదని విన్నవించారు. వారికి తప్పకుండా న్యాయం చేద్దామని భరోసానిస్తూ ముందుకు కదిలారు. మొత్తం మీద భరోసా యాత్ర మొదటి రోజు 18 కిలోమీటర్ల మేర.. 7 గంటల పాటు సాగింది. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జి బుడ్డా శేషారెడ్డి, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఐజయ్య, గుమ్మనూరు జయరాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే కొత్త కోట ప్రకాష్‌ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జీలు కాటసాని రాంరెడ్డి, చెరుకులపాడు నారాయణ రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి, హఫీజ్‌ఖాన్, మురళి, ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి, పార్టీ నేతలు కుందూరు శివారెడ్డి, పత్తికొండ మురళి, పోచా శీలారెడ్డి, గుండం సూర్యప్రకాష్‌రెడ్డి, తెర్నేకల్లు సురేందర్‌ రెడ్డి, రాంమోహన్‌ రెడ్డి, కృష్ణారెడ్డి, నాగరాజు యాదవ్, నరసింహులు యాదవ్, విజయకుమారి, విజయలక్ష్మి, మంగమ్మ, నొసం సుబ్బారెడ్డి, రామకృష్ణారెడ్డి, వంగాల భరత్‌కుమార్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, ఇబ్రహీం, వైబీ చలమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు