బీపీఎస్‌కు స్పందన కరువు

1 May, 2017 12:15 IST|Sakshi
బీపీఎస్‌కు స్పందన కరువు

మార్కాపురం టౌన్‌: జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అనుమతిలేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణ గడువు ముగిసిపోయింది. జిల్లాలో ఇంకా చాలా మంది క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకు రాలేదు. జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌ ఉన్నాయి. మున్సిపాలిటీల్లో జీప్లస్‌ వన్‌ భవనాన్ని నిర్మించుకునేందుకు అనుమతి ఇస్తారు. జీ ప్లస్‌ 2 భవనాన్ని నిర్మించుకోవాలంటే రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా మున్సిపాలిటీకి సదరు భవనాన్ని మార్టిగేజ్‌ చేయాలి. 300 స్క్వేర్‌ మీటర్ల నుంచి వెయ్యి స్క్వేర్‌ మీటర్ల వరకు నిర్మించే భవనానికి గుంటూరు రీజనల్‌ డెప్యూటీ డైరెక్టర్‌ నుంచి అనుమతి పొందాలి.

వెయ్యి స్క్వేర్‌ మీటర్లు దాటితే (4 అంతస్తుల పైన) హైదరాబాదులోని మున్సిపల్‌ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి అనుమతులు పొందాలి. దినదినాభివృద్ధి చెందుతున్న మార్కాపురంతోపాటు జిల్లాలో మున్సిపాలిటీలలో కొన్నేళ్లుగా అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు ఊపందుకున్నాయి. దీంతో పాటు మల్టీప్లెక్స్‌ కాంప్లెక్స్‌లు కూడా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనధికార కట్టడాలకు మున్సిపల్‌ అధికారులు అపరాధ రుసుం విధిస్తున్నారు. కాగా, పురపాలక సంఘం పరిధిలో 1 జనవరి 1985 నుంచి 2014 డిసెంబర్‌ 31 వరకు మున్సిపల్‌ అనుమతులు లేకుండా నిర్మించుకున్న కట్టడాలను క్రమబద్ధీకరించుకోవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన సమయం ఏప్రిల్‌ 30తో ముగిసింది. తదుపరి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఈ పథకం ద్వారా 1985 నుంచి 2014లోపు నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించుకోవాలని నిబంధన విధించింది. దీంతో జిల్లాలోనే మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలను గుర్తించి అధికారులు సుమారు 7 వేల భవనాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. అయితే జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో బిల్డింగ్‌ పీనలైరైజేషన్‌ పథకంలో భాగంగా 3,346 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 2,215 మంది క్రమబద్ధీకరించుకోగా, 1130 దరఖాస్తులు పరిష్కరించుకోవాల్సి ఉంది.

మామూలుగా భవన నిర్మాణదారులు ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులను మున్సిపల్‌ అధికారులు డౌన్‌లోడ్‌ చేసుకుని డాక్యుమెంట్‌ను పరిశీలించి సదరు బిల్డింగ్‌ వద్దకు వెళ్లాలి. అక్రమ కట్టడాలను గుర్తించి అపరాధ రుసుం విధించిన అనంతరం ఆ బిల్లును కట్టి బిల్డింగ్‌ను క్రమబద్ధీకరించుకోవాలి.  కష్టపడి పదివేలు డిపాజిట్‌ చెల్లించి ఆన్‌లైన్‌ చేయించుకుని వచ్చిన వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని పరిశీలించడానికి  అనువైన పరికరాలు మున్సిపాలిటీలో లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని వార్తలు