వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో టోకరా

12 Dec, 2016 14:48 IST|Sakshi
శివప్రసాద్

సాక్షి, సిటీబ్యూరో: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి, ఆకర్షితులై సంప్రదించిన వారి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేసి టోకరా వేస్తున్న మోసగాడిని సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. గడిచిన నాలుగు నెలల్లో అనేక మంది ఇతడి బారిన పడినట్లు డీసీపీ అవినాష్‌ మహంతి మంగళవారం తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎర్రం శివప్రసాద్‌ అలియాస్‌ గణేష్‌ కుమార్‌ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో స్థిరపడ్డాడు.

నాలుగు నెలల క్రితం వికాస్‌నగర్‌లో స్పీడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవాడు. ఆకర్షితులై సంప్రదించిన వారి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల పరుతో రూ.1000 వసూలు చేసే వాడు. కొన్ని టెక్టŠస్‌ బుక్స్‌లో ఉన్న అంశాలను చేతిరాత ద్వారా పెద్ద అక్షరాల్లో (క్యాపిటల్‌ లెటర్స్‌) తిరగరాయాలని, ఒక్కో ప్రాజెక్టుకు రూ.10 వేల చొప్పున చెల్లిస్తామంటూ నమ్మబలికే వాడు. ప్రాజెక్టు ఇచ్చే సమయంలోనే అడ్డదిడ్డమైన నిబంధనలు విధించే శివప్రసాద్‌ చివరకు పూర్తి చేసిన ప్రాజెక్టుల్ని తిరస్కరిస్తూ టోకరా వేసేవాడు. ఇటీవల ఎస్సార్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మాయావతి పత్రికలో ప్రకటన చూసి శివప్రసాద్‌ను సంప్రదించారు.

ఆమె నుంచి రూ.వెయ్యి వసూలు చేసిన నిందితులు ఓ ప్రాజెక్టు ఇచ్చాడు. అతికష్టమ్మీద ఆమె దాన్ని పూర్తి చేసినప్పటికీ చేతి రాతతో రాసిన దాంట్లో 50 తప్పులు ఉన్నాయంటూ తిరస్కరించి నగదు చెల్లించకుండా మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ ఆదేశాల మేరకు మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్ టీమ్‌ ఇన్ స్పెక్టర్‌ జి.శంకర్‌రావు నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. మంగళవారం నిందితుడైన శివప్రసాద్‌ను అరెస్టు చేసి సెల్‌ఫోన్లు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకుంది.  

 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు