మనసున్న మాస్టారు!

21 Jul, 2016 05:37 IST|Sakshi
మనసున్న మాస్టారు!

మనసున్న మాస్టారు!
మదనపల్లె అర్బన్‌: పేదరికంతో బాల్యంలో చదువుకునేందుకు నానాకష్టాలు పడ్డారు. తమకు చదువునేర్పిన గురువులెందరినో స్ఫూర్తిగా తీసుకుని కష్టాలను అధిగమించి పట్టుదలతో చదువుకుని ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించారు. వృత్తికే పరిమితం కాకుండా సాధించిన దాంతో తృప్తి చెందక తాము పనిచేస్తున్న పాఠశాలలోనే పేద విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారి ఎదుగుదలకు అవసరమైన ప్రత్యేక శిక్షణను అందిస్తున్న ముగ్గురు మనసున్న మాస్టార్లపై కథనం..

పట్టణంలోని చీకలగుట్టలోని శివాజీనగర్‌ పురపాలక ప్రాథమిక పాఠశాల. ఒకప్పుడు వసతుల లేమితో, విద్యార్థులు లేక బాలారిష్టాలు పడుతుండేది. 2012లో డీఎస్సీలో ఎంపికైన ఇద్దరు ఉపాధ్యాయులు హరిబాబు, యాస్మీన్‌లు ఆ పాఠశాలకు డిప్యుటేషన్‌పై వచ్చారు. అప్పటి పాఠశాల విద్యార్థుల సంఖ్య 46. పాఠశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడం, ఉపాధ్యాయులు లేకపోవడం, ప్రభుత్వ పాఠశాలలపై పరిసర తల్లిదండ్రులకు సదాభిప్రాయం లేకపోవడంతో విద్యార్థులు పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదని గమనించారు. ఎలాగైనా పాఠశాలను అభివృద్ధి చేయాలని, విద్యార్థుల సంఖ్యను పెంచి తల్లిదండ్రుల అభిమానాన్ని చూరగొనాలని వీరిద్దరూ కంకణం కట్టుకున్నారు. చేరిన రోజు నుంచీ రోజూ వినూత్న పద్ధతిలో బోధన చేస్తూ పనివేళల్లో కాకుండా విరామ సమయాల్లో చుట్టుపక్కల కాలనీలో తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించారు.

మెల్లమెల్లగా ప్రైవేటుపాఠశాలలకు ధీటుగా తాము బోధన చేస్తామంటూ ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను ఒప్పించగలిగారు. ఫలితంగా రెండో సంవత్సరం 66, మూడో సంవత్సరం 78, నాలుగో సంవత్సరం 108మంది విద్యార్థులను చేర్పిస్తూ పట్టణంలోని ప్రభుత్వపాఠశాలలకే ఆదర్శంగా నిలిచారు. పాఠశాలలో కనీసవసతుల కోసం ప్రభుత్వానికి నివేదించడంతోపాటు తమకు వచ్చిన జీతాల్లో నుంచి కొంతమేర వెచ్చించి మౌలికసదుపాయాలు సమకూర్చుకున్నారు. మరుగుదొడ్లు, పిల్లలకు తాగేందుకు మినరల్‌ వాటర్, దాతల సహకారంతో ఉచిత నోటుపుస్తకాలు, సామాగ్రి, స్వంత నిధులతో పిల్లలకు షూ, బెల్ట్, ఐడీ కార్డులు ఇచ్చి తామెవరికీ తీసిపోమనే ధైర్యాన్ని విద్యార్థులలో నింపారు. నవోదయ, గురుకుల ప్రవేశపరీక్షల కోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ను నియమించి పాఠశాల పనివేళల తర్వాత రోజూ గంటన్నరసేపు శిక్షణ ఇప్పిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు