మానవత్వం పరిమళించింది

18 Nov, 2016 04:27 IST|Sakshi
మానవత్వం పరిమళించింది
  • బెహ్రయిన్‌లో తాటిపాక మహిళకు చిత్రహింసలు
  • చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో నాలుగు నెలలు
  • దాతల సాయంతో స్వస్థలానికి
  • మలికిపురం :
    ఉపాధి కోసం విదేశానికి వెళ్లిన ఆ మహిళను యజమానురాలైన తోటి మహిళే చిత్ర హింసలు పెట్టిన వైనమిది.  చావు బతుకుల మధ్య సుమారు నాలుగు నెలలు కొట్టుమిట్టాడిన ఆమె దాతల సాయంతో ప్రాణాలతో స్వదేశంలోని ఇంటికి చేరింది. వివరాలిలా ఉన్నాయి. రాజోలు మండలం తాటిపాక గ్రామానికి చెందిన అనచూరి పద్మ సఖినేటిపల్లి మండలం శృంగవరప్పాడులోని తన అక్క ఇంటి వద్ద ఉండేది. ఇక్కడ నుంచి సుమారు రెండేళ్ల క్రితం ఉపాధి కోసం బెహ్రయిన్‌ దేశం వెళ్లింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో స్వస్థలం చేరుకుని, తిరిగి జూన్‌ 24న బెహ్రయిన్‌ చేరుకుంది. మొదటిసారి బాగానే చూసిన ఆ దేశంలోని యజమానురాలు రెండో దఫా వచ్చిన అనంతరం చిత్రహింసలు పెట్టడం ప్రారంభించింది. వెళ్లిన తరువాత 20 రోజుల పాటు కనీసం భోజనం కూడా పెట్టకుండా పద్మ పట్ల శాడిజంగా వ్యవహరించేది. ఇలాగైతే తాను బతికేది ఎలా? అని ప్రశ్నించిన పద్మను ఆ యజమానురాలు పొత్త కడుపుపై తన్నింది. స్పృహ కోల్పోయిన పద్మను ఆసుపత్రిలో చేర్చగా ఆపరేషన్‌ జరిగింది. ఆసుపత్రిలో కోలుకుంటున్న పద్మతో యజమానురాలు ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టించుకుని వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచీ పద్మ అదే ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది.
     
    ఫోన్‌ రాకపోవడంతో..
    పద్మ నుంచి ఫోన్‌ రాకపోవడంతో శృంగవరప్పాడులోని ఆమె సోదరీమణులు ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించడం ప్రారంభించారు. తాటిపాకలోని కేతా శ్రీను అనే వ్యక్తి ద్వారా మలికిపురం జీఎన్నార్‌ ట్రస్టు అధ్యక్షుడు, ప్రవాస భారతీయ వైద్యుడు గెద్డాడ నాగేశ్వరరావుకు విషయం చెప్పి సాయం చేయమని కోరారు. ఆయన బెహ్రయిన్‌లోని తెలుగు వారైన గేదెల సురేష్,  పాస్టర్‌ నవీన్, పొన్నమండ శ్రీను, గాడి శ్రీనుల ద్వారా పద్మ ఆచూకీ కోసం ప్రయత్నించి రెండు నెలలుగా ఒక ఆసుపత్రిలో కోలుకుంటున్నట్టు గుర్తించారు. వారంతా చందాలు వేసుకుని ఆమెకు వైద్యం చేయించారు. దాదాపు నాలుగు నెలలపాటు ఆమె ఆసుపత్రిలో ఉంది. ఆరోగ్యం క్షీణించిన పద్మ స్వస్థలం రావాలంటే ఆమెకు విమానంలో మరో వైద్యుడి సహకారం అవసరం. దీంతో వీరంతా  రూ.1.20 లక్షలు సమకూర్చి ఇండియాకు తీసుకు వచ్చారు. ఎట్టకేలకు గురువారం శృంగవరప్పాడు చేసుకున్న పద్మ తన వారికి చూసుకుని కన్నీరు మున్నీరైంది. ఆ దేశ మహిళ తనను తీవ్రంగా హింసించడమే గాక,అక్కడి ఎంబసీ కూడా కరుణించలేదని ఈ సందర్భంగా పద్మ వాపోయింది. దాతలు లేకుంటే ఈ రోజు తాను లేనంటూ కృతజ్ఞతలు తెలిపింది.
మరిన్ని వార్తలు