మాండవ్యపుర రాజ్యంలో ‘ఢీ’

24 Dec, 2016 23:49 IST|Sakshi
  • లక్కింశెట్టి శ్రీనివాసరావు 
  •  
    ఒకప్పుడు రెడ్డి కాని రెడ్డి పాలించిన రాజ్యం అది. ఇప్పుడదొక ’కమ్మ’ని రాజ్యం. అలాగని కమ్మగా ఉంటుం దనుకునేరు చాలా హాట్‌గానే ఉంటుంది. దశాబ్థ కాలం ఆ మాండవ్యపురాన్ని ’వంక’ వంశీకులు పాలించారు. ఆ తరువాత ’వంక’ రాజ్య వంశీయులు స్వయంవరంలో పాల్గొన్నట్టే పాల్గొని వెనుతిరిగారు. ఆ మాండవ్యపుర రాజ్యంలో ఎవరైనా దశాబ్థ కాలం మాత్రమే పాలించడం ఆనవాయితీ. ’వంక’ వంశీయుల వెంట తిరిగి, తిరిగి వారి రాజనీతితోనే వారినే కూలదోసి ఆ రాజ్యంలో పాగా వేశారు మాండవ్య మహారాజు. ప్రస్తుతం మాంచి ’జోష్‌’ మీదున్న ఆయన పాలన మొదలై దశాబ్దం పూర్తికావస్తోంది. గత సంప్రదాయం భవిష్యత్తులో పునరావృతం అవుతుందంటే ఆ మహారాజులో ఆందోళన మొదలవదా మరి. ఇప్పుడు ఆ మాండవ్య రాజ్యంలో అదే జరుగుతోంది. ఆ భయంతోనే ఆ మహారాజు సామంత రాజులపై ఒక కన్నేసి ఉంచాడు. నలుగురు సామంతుల్లో తనకు పోటీ పడే స్థాయిలో అమ్ముల పొదిలో అన్ని అస్రా్తలు కలిగి కూతవేటు దూరంలో ఉన్న సామంత రాజును తన పాలనా అనుభవంతో అణగదొక్కేసే ఎత్తులు వేస్తున్నారు. ఎక్కడ తన రాజ్యానికి ఎసరు పెడతారేమోననే ముందుచూపుతో మాండవ్యపుర రాజు చేస్తున్న పనులను చెక్‌ పెట్టేందుకూ సామంతరాజు పావులు కదపడం ప్రారంభించడంతో మాండవ్యపురాన్ని ఏలుతున్న ఆ మహారాజుకు ఏడాదిగా సామంత రాజు భయం పట్టుకుంది.ఎందుకంటే ఆ రాజ వంశంలో మహారాజుతో సమానంగా అర్థ, అంగబలంతో యుద్ధ రంగంలో ఢీ అంటే ఢీ అనే తెగువ ఆ సామంత రాజుకు ఉండటమే.  సంప్రదాయం పునరావృతమై తన పీఠాన్ని ఎక్కడ లాగేసుకుంటారో అని ఆ రాజుకు బెంగపట్టుకుంది.
    సామంతు రాజకీయం...
    గతంలో రాజుల కాలంలో కూడా లేని సంప్రదాయాన్ని మాండవ్యపుర మహరాజు తీసుకువచ్చి సామంత రాజు నెత్తినెక్కి కూర్చోవడం అక్కడి ప్రజలకు నచ్చడం లేదు. ముందు కాలంలో తన పీఠాన్ని ఆ సామంతరాజు ఎక్కడ వశపరుచుకుంటాడోనని బెంగ. మరే రాజ్యంలో లేని విధంగా సామంతరాజు పాలనా మందిరంపైనే మందిరాన్ని పెట్టుకుని రాజ్య పాలన సాగిస్తున్నారు. చివరకు సామంతరాజు వద్ద పనిచేసే మంత్రులు, సేవకులు, భటులు అందరినీ తన అదుపు ఆజ్ఞల్లో పెట్టుకుని ఆ రాజు సాగిస్తున్న పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజు నియంతృత్వ పోకడలు భరించలేకపోతున్న పలు పరగణాల్లోని చిన్నాచితకా సామంతులంతా  మాండవ్యపుర సామంత రాజు శరణు కోరుతున్నారు. మా రాజ్యాలన్నీ మీ వెనకే ఉంటాయని చీకటి సందేశాలు కూడా పంపిస్తున్నారు.  సామంత రాజు భవిష్యత్తులో తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయని ఇటీవలనే వేగులు ఆ మాండవ్య రాజు చెవిలో వేయడంతో రాజుగారిలో ఆందోళన రెట్టింపైంది.
    ఆ మాండవ్య రాజుతో మాంచి సాన్నిహిత్యం ఉన్న ’చంద్ర’గిరి చక్రవర్తి  ప్రజాధనాన్ని ఒంటెద్దు పోకడలతో ఏకపక్షంగా చేసుకుపోతున్నాడు. ఆ ప్రజా ధనమేదో తన వంశీకుల నుంచి వారసత్వంగా వచ్చినట్టు భావించి రాజ్యంలో ప్రజలకు రహదారులు, గుడిసెలు స్థానే పక్కా ఇళ్లు, మాండవ్యపుర నగరంలో అంగళ్లు అన్నీ నచ్చిన వారి కి నచ్చినట్టు ఇచ్చుకుంటూ పోతున్నాడు. వీటిలో సామంత రాజు ప్రమేయం లేకుండా అన్నీ మాండవ్యపుర మహారాజే తన అనుంగులు ద్వారా చక్కబెట్టేసుకుంటున్నారు. మాండవ్యపుర నగరంలో ఒకప్పుడు నిరుపేదలకు స్వర్ణయుగం అందించాలనే తపనతో రాజన్న రాజ్యంలో 5000 మందికి 123 ఎకరాలు సేకరించారు. అందులో 2000 మంది పేదలకు ఇవ్వగా 63 ఎకరాలు మిగిలింది. వాటిని ఇప్పుడు మాండవ్యరాజు 4,064 మందికి ఇచ్చే ప్రయత్నం మొదలుపెట్టారు. వాటన్నింటినీ స్థానిక పరగణాల సామంతుల ప్రాధాన్యం లేకుండా అన్నీ ఆ మహరాజు వంది,మాగదుల ద్వారానే జరిపించేసుకున్నారు. ఇలా మాండవ్యపుర మహరాజు సుమారు 900 రోజులుగా సాగిస్తున్న ఏకపక్ష పాలన చక్రవర్తి దృష్టికి వెళ్లినా ఫలితం లేదు. ఏతావాతా ఏదో ఒక రోజు మాండవ్యమహరాజు భయపడ్డట్టే సామంత రాజులు తిరుగుబాటు తప్పేటట్టు లేదని మాండవ్య రాజ్య ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
     
మరిన్ని వార్తలు