మానుకోటలో ‘ఫైబర్‌ టు ది హోం’ అభినందనీయం

23 Aug, 2016 23:58 IST|Sakshi
మానుకోటలో ‘ఫైబర్‌ టు ది హోం’ అభినందనీయం
  • తొలి విడతలో 10 గ్రామాలకు ఉచిత వైఫై సేవలు
  • ఎంపీ సీతారాం నాయక్‌
  • కేబుల్‌ ఆపరేటర్ల సహకారంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ప్రాజెక్టు
  • పోచమ్మమైదాన్‌ : మానుకోట పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో కేబుల్‌ ఆపరేటర్ల సహకారంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో ‘ఫైబర్‌ టు ది హోం’(ఎఫ్‌టీటీహెచ్‌) కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని మహబూబాబాద్‌ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్‌ అన్నారు. మంగళవారం వరంగల్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రధాన కార్యాలయంలో ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌(పీజీఎం) నరేందర్‌ అధ్యక్షతన నిర్వహించిన టెలికాం అడ్వైజరీ కమిటీ(టీఏసీ) సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరికి హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించడమే లక్ష్యంగా ఎఫ్‌టీటీహెచ్‌ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.
     
    మహారాష్ట్ర తరహాలో మానుకోట పార్లమెంట్‌ స్థానం పరిధిలో తొలి విడతగా 10 గ్రామాలు ఉచిత వైఫై సేవలు అందేలా చూస్తానన్నారు. చిన్న జిల్లాలతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎంపీ అన్నారు. ప్రజలకు మరిన్ని∙మెరుగైన సేవలు అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సమాయత్తం కావాలన్నారు. అనంతరం పీజీఎం నరేందర్‌ మాట్లాడుతూ జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా ప్రతినెలా 10వేల కొత్త సెల్‌ఫోన్‌ కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. మహబూబాబాద్‌లో త్వరలో బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు ప్రారంభిస్తామన్నారు. అంతకుముందు ఫిబ్రవరి 6న జరిగిన టీఏసీ సమావేశంలో సభ్యులు లెవనెత్తిన సమస్యలకు చూపిన పరిష్కారాల గురించి నివేదిక చదివి వినిపించారు.
     
    టీఏసీ సభ్యుడు ఒగిలిశెట్టి అనిల్‌ మాట్లాడుతూ వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌లో ఇటీవల ఓఎఫ్‌సీ కేబుల్‌ కట్‌ కావడంతో రెండు రోజుల పాటు అక్కడి ఎస్‌బీహెచ్‌లో బ్యాకింగ్‌ సేవలు నిలిచిపోయాయన్నారు. అజ్మీర శ్రీనివాస్‌ నాయక్‌ మాట్లాడుతూ నర్సంపేట మహేశ్వరంలోని రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌ రావు ఇంట్లో ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌ గత కొన్ని రోజులుగా పని చేయడం లేదని, బీఎస్‌ఎన్‌ఎల్‌ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో సభ్యులు బాస్కుల ఈశ్వర్, వీరస్వామి, సోమనర్సజీ, పీఆర్‌ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు