అంతర్గత భద్రతకు మెరైన్‌ పోలీసు వ్యవస్థ

16 Jun, 2017 23:41 IST|Sakshi
అంతర్గత భద్రతకు మెరైన్‌ పోలీసు వ్యవస్థ
పల్లిపాలెం(సఖినేటిపల్లి) : అంతర్గత భద్రతకు మెరైన్‌ పోలీసు వ్యవస్థ ఎంతో అవసరమని డిప్యూటీ సీఎం, రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శుక్రవారం గ్రామంలో సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్మాణ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన నూతన మెరైన్‌ పోలీసు స్టేషన్‌ భవనాన్ని డిప్యూటీ సీఎం రాజప్ప ప్రారంభించారు. అలాగే ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూర్యారావు అద్యక్షతన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజప్ప ముఖ్య అతిథిగా మాట్లాడారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమని అన్నారు. అలాగే రాష్ట్రాభివృద్థికి శాంతిభద్రతల అంశం చాలా కీలకమని, దీనికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో తీర ప్రాంత భద్రతలో 21 మెరైన్‌ పోలీసు స్టేషన్లు ఉన్నాయని వెల్లడించారు. తీర రక్షణలో కేంద్రం కోస్ట్‌గార్డ్‌ వ్యవస్థ, రాష్ట్రం మెరైన్‌ వ్యవస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. స్టేషన్లకు అవసరమైన సదుపాయాలు సమకూర్చుకునేందుకు తగిన నిధులు బడ్జెట్‌లో కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. గ్రామంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. అలాగే పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వెల్లడించారు. మత్య్సకారుల సంక్షేమానికి ప్రభత్వం పలు పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే సూర్యారావు మాట్లాడుతూ, సెప్టెంబర్‌లో ఫిషింగ్‌ హార్బర్‌ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సౌత్‌ కోస్టల్‌ జోన్‌ ఇన్‌చార్జ్‌ ఐజీ ఎన్‌.సంజయ్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో 974 కిలోమీటర్ల పొడవునా ఉన్న తీరంలో భద్రతకు 21 స్టేషన్‌లు పనిచేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఫిషింగ్‌ హార్బర్, మెరైన్‌ స్టేషన్లు ఏర్పాటుకు సహకరించిన దాతలను హోం మంత్రి రాజప్ప, ఎమ్మెల్యేలు సత్కరించారు. గోదావరి డెల్టా కమిటీ చైర్మన్‌ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, గ్రామ సర్పంచ్‌ చొప్పల చిట్టిబాబు, ఎంపీపీ పప్పుల లక్ష్మీసరస్వతి, ఎంపీటీసీ సభ్యురాలు కొల్లాటి శేషాలక్ష్మి, ఓఎస్‌డీ (సివిల్‌) రవిశంకర్‌రెడ్డి, మెరైన్‌ డీఎస్పీలు రాజారావు, నరసింహరావు, సీఐ ఎం శ్యాంకుమార్, తహసీల్దారు డీజే సుధాకర్‌రాజు, ఎంపీడీఓ జీ వరప్రసాద్‌బాబు, రాజోలు సీఐ క్రిష్టోఫర్, మలికిపురం ఎంపీపీ జి.గంగాభవాని, జెడ్పీటీసీ సభ్యురాలు మంగెన భూదేవి, సర్పంచ్‌లు బందెల పద్మ, భాస్కర్ల గణపతి, నాయకులు వనమాలి మూలాస్వామి, రావూరి మాణిక్యాలరావు, చింతా వీరభద్రేశ్వరరావు, ముప్పర్తి నాని పాల్గొన్నారు.
అంతర్వేది దేవస్థానంలో..
గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న అంబేడ్కర్‌ భవనానికి హోం మంత్రి  చినరాజప్ప శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే సూర్యారావు సహకారంతో స్థానిక కస్పా కోఆపరేటివ్‌ సొసైటీ అధ్వర్యంలో ఈభవనం నిర్మించనున్నారు. తాడి నీలకంఠం, జంపన ప్రసాదరావు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు