ఈ–మండీలుగా మార్కెట్‌ కమిటీలు

4 Nov, 2016 23:21 IST|Sakshi
ఈ–మండీలుగా మార్కెట్‌ కమిటీలు

విజయవాడ : జిల్లాలోని 19 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను ఈ–మండీలుగా మార్చాలని కలెక్టర్‌ బాబు.ఎ ఆదేశించారు. స్థానిక తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ శుక్రవారం మార్కెటింగ్, వ్యవసాయ ఈ–నామ్‌ సాంకేతిక సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాబు.ఎ మాట్లాడుతూ మార్కెట్‌ కమిటీల ద్వారా జరిగే ప్రతి లావాదేవీని ఈ–మండీ విధానంలో నిర్వహించాలని స్పష్టంచేశారు. ప్రతి మార్కెట్‌ కమిటీ ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్‌ కేంద్రంగా పని చేయాలని పేర్కొన్నారు. ఇందు కోసం ఆయా మార్కెట్‌ కమిటీలను రైతుల నుంచి లావాదేవీలు నిర్వహించేలా అభివృద్ధి చేయాలని సూచించారు. వ్యాపార కేంద్రాలుగా మార్కెట్‌ కమిటీలు రూపుదిద్దాలని కలెక్టర్‌ అన్నారు. వ్యవసాయశాఖ అధికారులు ఏఎంసీల పరిధిలో పండించే పంటల వివరాలు సేకరించి రైతులు తమ పంట దిగుబడులను సమీపంలోని మార్కెట్‌ యార్డులో విక్రయించేలా చూడాలని స్పష్టంచేశారు. మధ్యవర్తుల ద్వారా జరిగే కొనుగోళ్ల వల్ల రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. దూరాభారం వల్ల రైతులు నస్టపోతున్నారని తెలిపారు. ఆయా కమిటీల పరిధిలో జరిగే పంటల లావాదేవీల వివరాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ గంధం చంద్రుడు మాట్లాడుతూ ఇతర మార్కెట్ల పరిధిలో సాగయ్యే పంటలు, వాటి లావాదేవీ వివరాలు, రైతులకు లభిస్తున్న ధరలు తదితర వివరాలను ప్రతి మార్కెట్‌ యార్డ్‌ పరిధిలో ప్రదర్శించాలని సూచించారు. మార్కెటింగ్‌ శాఖ జేడీ సి.రామాంజనేయులు, వ్యవసాయశాఖ జేడీ యు.నరసింహారావు, ఏఎంసీ సెక్రటరీ గోపాలకృష్ణ, డీడీవో శ్యామ్‌ సుందర్‌ ఈ–నామ్‌ కంపెనీ ప్రతినిధి ఎం.చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.




 
 

మరిన్ని వార్తలు