ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణకు స్పందన

22 Aug, 2016 22:46 IST|Sakshi
శిక్షణకు వచ్చిన నిరుద్యోగ యువకులు

పలాస: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ ఎంపిక కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. కాశీబుగ్గ పోలీస్‌ గ్రౌండ్‌లో సోమవారం జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ ఎంపిక కార్యక్రమానికి పోలీస్‌ సబ్‌ డివిజన్‌లోని వివిధ మండలాల నుంచి నిరుద్యోగ యువకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపిక కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్‌ ప్రారంభించారు. బరువు, ఎత్తు, కొలతలతో పాటు అర్హులైన వ్యక్తుల నుంచి వివిధ సర్టిఫికెట్ల నకళ్లను సెట్‌శ్రీ మేనేజర్‌ బీవీ ప్రసాదరావు పరిశీలించారు. కార్యక్రమానికి 310 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లా మొత్తం మీద  300 మందిని ఎంపిక చేసి వారిని నెలరోజులు పాటు జిల్లా పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రసాదరావు చెప్పారు. నెల రోజులపాటు శిక్షణ తర్వాత అక్టోబరు 5 నుంచి 15 వరకు కాకినాడలో జరుగనున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి పంపిస్తామన్నారు. కార్యక్రమంలో కాశీబుగ్గ ఎస్‌ఐ బి.శ్రీరామ్మూర్తి, సెట్‌శ్రీ అకౌంటెంట్‌ అప్పలనాయుడు, సీనియర్‌ అసిస్టెంట్‌ కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు