మట్కారాయుళ్ల అరెస్ట్‌

23 Feb, 2017 00:22 IST|Sakshi
ఆదోని టౌన్‌:  ఆదోని పట్టణంలో మట్కా నిర్వహిస్తున్న ఇద్దరు బీటర్లు, మట్కా ఆడుతున్న 19 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. చందసా దర్గా సమీపంలో పింజరిగేరికి చెందిన అబ్దుల్‌ గని, తిరుమల నగర్‌కు చెందిన భూషయ్య మట్కా బీట్‌ రాస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు త్రీ టౌన్‌ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐలు విజయ్‌కుమార్, రమేశ్‌బాబు, సిబ్బంది రవి, ఎలిసా మరికొంత మంది కానిస్టేబుళ్లు బుధవారం దాడి చేసి వివిధ ప్రాంతాలకు చెందిన 19 మట్కా రాయుళ్లు, ఇద్దరు బీటర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 14 సెల్‌ఫోన్లు, రూ.8,040, మట్కా చీటీలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. 
  కుటుంబ సభ్యుల మధ్య మట్కా రాయుళ్లకు కౌన్సెలింగ్‌
మట్కా రాయుళ్లకు వారి కుటుంబ సభ్యుల మధ్య డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మట్కాతో ఎంత సంపాదిస్తున్నారని వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. అయితే రోజూ వంద, రెండొందలు నష్టపోతున్నామని మట్కా రాయుళ్ల సమాధానమిచ్చారు. మట్కా ఉచ్చులో పడి కుటుంబీకులను నిర్లక్ష్యం చేస్తున్నారని, కుటుంబాలను నాశనం చేసుకోవద్దని డీఎస్పీ హితవు పలికారు. మట్కా వ్యసనానికి దూరంగా ఉండాలని రోజూ నెత్తీనోరూ కొట్టుకొని చెప్పినా వినిపించుకోవడం లేదని మహిళలు తమ భర్తలపై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇక మీదట మట్కా ఆడము, రాయమని కుటుంబ సభ్యుల సమక్షంలోనే ప్రతిజ్ఞ చేశారు. మళ్లీ మట్కా ఆడినా, రాసినా.. ఉపేక్షించేది లేదని, అవసరమైతే పీడీ యాక్ట్‌ను అమలు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు.     
 
మరిన్ని వార్తలు