నెల్లూరులో మంత్రి vs మేయర్

31 May, 2016 12:18 IST|Sakshi
నెల్లూరులో మంత్రి vs మేయర్

మేయర్ కలల ప్రాజెక్టుకు మంత్రి ప్రారంభోత్సవం
అజీజ్ లేని సమయంలో ప్రారంభోత్సవం
► మేయర్ మద్దతుదారుల అసహనం


నెల్లూరు: నెల్లూరు నగరంలోని ప్రధాన వీధులన్నీ దుమ్ములేకుండా శుభ్రం చేసే కార్యక్రమాన్ని తన ఖాతాలో వేసుకోవాలనుకున్న మేయర్ అబ్దుల్ అజీజ్‌కు గొంతులో వెలక్కాయపడ్డట్లయింది. ఆయన దేశంలో లేని సమయంలో మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ సోమవారం రోడ్లను శుభ్రం చేసే యంత్రాన్ని ప్రారంభించి నగరంలోని దుమ్ము దులిపేసే మంచి పని తన వల్లే జరిగిందని చెప్పకనే చెప్పారు. అజీజ్ కలల ప్రాజెక్టును మంత్రి ఇలా చడీ చప్పుడు లేకుండా ప్రారంభించి మేయర్‌ను అవమానించారని ఆయన మద్దతుదారులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

నగరంలోని ప్రధాన రహదారులన్నీ దుమ్ముతో నిండిపోయి వాహన చోదకులకు తీవ్ర అసౌకర్యగా ఉంది. దీంతో పాటు ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధులు కూడా సోకే ప్రమాదం ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే జనమే కాకుండా స్థానికులు సైతం దుమ్ముకొట్టుకుని ఉన్న రోడ్ల విషయంలో  కార్పొరేషన్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. నగరంలోని సందులు, గొందుల రోడ్లు కాకపోయినా కనీసం ప్రధాన రహదారులైనా దుమ్ములేకుండా శుభ్రం గా ఉంచి జనంలో మార్కులు కొట్టేయాలని మేయర్ అజీజ్ ఆశపడ్డారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని అధికారులతో చర్చించారు.

విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లలో రోడ్లు శుభ్రం చేసే యంత్రాలు ఉన్నాయనీ, అలాంటివి ఇక్కడకు కూడా తీసుకుని వస్తే  రాత్రి పూట ప్రధాన రోడ్లన్నీ శుభ్రం చేయొచ్చని అధికారులు సలహా ఇచ్చారు. సుమారు రెండు, మూడు నెలల ప్రయత్నం అనంతరం నెల్లూరుకు ఇలాంటి యంత్రాన్ని తెప్పించారు. ఏడాదికి రూ.1.67 కోట్లు చెల్లించే విధంగా ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గంటకు 8 కిలో మీటర్ల దూరం రోడ్డును శుభ్రం చేసే ఈ యంత్రాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించాలని మేయర్ అజీజ్ ఆశపడ్డారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక ఈ యంత్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కార్పొరేషన్ అధికారులకు సూచించారు.
 
వనంతోపు సెంటర్లో యంత్రం ప్రారంభం:
సోమవారం నెల్లూరులో ఉన్న మంత్రి నారాయణ  వనంతోపు సెంటర్‌లో రోడ్డు శుభ్రపరిచే యంత్రాన్ని ప్రారంభించారు. కార్పొరేషన్ అధికారులు హడావుడిగా ఈ ఏర్పాట్లు చేశారు. ఈ యంత్రాన్ని మేయర్ ప్రారంభించాలని అనుకున్నారనీ, ఆయన దేశంలో లేని సమయంలో హడావుడిగా మంత్రి ప్రారంభించడం ఆయన్ను అవమానించినట్లేనని అజీజ్ మద్దతుదారుడు షంషుద్దీన్ ప్రారంభ సమయంలోనే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది మేయర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆయన లేని సమయంలో ప్రారంభించడం సరైంది కాదన్నారు. కమిషనర్ వెంకటేశ్వర్లు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఇది చాలా చిన్న విషయం కాబట్టి సీరియస్‌గా తీసుకోవద్దని మంత్రి ఆ నాయకుడికి చెప్పి వెళ్లిపోయారు. టీడీపీలో చేరినప్పటి నుంచి ఆ పార్టీ ముఖ్య నేతలు అజీజ్‌ను ఏ మాత్రం గౌరవించడం లేదనీ, అసలు ఆయన్ను అధికార పార్టీ నాయకుడిగానే పరిగణించడం లేదని ఆయన మద్దతుదారులు రగిలిపోతున్నారు. తమ నాయకుడిని ప్రతి విషయంలో అవమానకరంగానే చూస్తున్నారని మండిపడుతున్నారు. అయితే మంత్రి మద్దతుదారులు మాత్రం అజీజ్‌కు అంత సీన్ లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు