మెప్మా.. ముడుపులేంటి చెప్మా!

28 May, 2017 01:24 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. లంచం ఇవ్వనిదే రుణాలు మంజూరు కావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు మెప్మా ద్వారా రుణాలు ఇస్తున్నారు. ప్రతి రుణానికి రూ.5 వేల చొప్పున సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు. మెప్మాలో పనిచేసే ఆర్‌సీ సిబ్బందికి ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు కాబట్టి.. రుణాలు పొందే లబ్ధిదారుల నుంచి వసూలు చేసి ఇవ్వాలని గత ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నిబంధన పెట్టారు. ప్రతి పది గ్రూపులకు ఒక ఆర్‌సీ ఉంటా రు. వీరు గ్రూపుల నుంచి ఏమేరకు రుణాలు వసూలు కావాల్సి ఉంది, పాత రుణం ఎప్పటికి పూర్తవుతుంది, కొత్తగా రుణానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయాలు చెబుతుంటారు. వీరికి ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం ఇవ్వడం లేదు. వారికి వేతనాలు చెల్లించే పేరిట లబ్ధిదారుల నుంచి వసూళ్లకు పాల్పడటం వివాదాస్పదం అవుతోంది. ప్రతి లబ్ధిదారు నుంచి రూ.5 వేల చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్న సొమ్ము జిల్లాస్థాయి వరకూ పంపిణీ అవుతోందని సమాచారం. 
 
ఇతరుల నుంచీ..
స్వయం సహాయక సంఘాల మహిళల భర్తలు చిరు వ్యాపారాలు చేసుకునేందుకు.. వారి పిల్లల చదువు కోసం కూడా మెప్మా ద్వారా రుణాలు ఇస్తారు. ఈ  విభాగంలో ఏడాది జిల్లాలోని అన్ని పట్టణాలకు 983 యూనిట్లు మంజూరు కాగా.. 612 యూనిట్లకు రుణాలిచ్చారు. దీంతోపాటు తోపుడు బళ్ల వ్యాపారులకు రుణాలు ఇవ్వడం, నైపుణ్య అభివృద్ధి పథకం కింద నిరుద్యోగుల స్వయం ఉపాధికి సంబంధించి శిక్షణ ఇప్పించి, రుణాలు మంజూరు చేయడం వంటి పథకాలు ఉన్నాయి. ఐదు మున్సిపాలిటీలలో స్త్రీ నిధి బ్యాంకులు నిర్వహిస్తున్నారు.  ఆయా విభాగాల వారీగా ఇచ్చే రుణాలకు సంబంధించి ఒక్కో రేటు కట్టి వసూలు చేస్తున్నారు. రూ.లక్ష రుణం పొందితే రూ.5 వేలు సమర్పించుకోవాలి్సందే. అంతకు తక్కువ ఇస్తే ఊరుకోవడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
 
పైసా ఇవ్వక్కర్లేదు
మెప్మా పీడీగా బాధ్యతలు స్వీకరించిన ప్రకాశరావును ఈ విషయమై వివరణ కోరగా.. రుణాల కోసం ఎవరికీ పైసా చెల్లించాలి్సన అవసరం లేదన్నారు. ఎవరైనా సొమ్ము డిమాండ్‌ చేస్తే తనకు ఫిర్యాదు చేయాలని కోరారు. అవినీతి ఆరోపణలు వస్తే క్లస్టర్, మండల, జిల్లా స్థాయి అధికారినైనా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. అవినీతిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదన్నారు.
 
మరిన్ని వార్తలు