మంత్రి ఫోన్‌తో నమోదు కాని కేసు

11 Nov, 2016 23:16 IST|Sakshi

- దూషించినవారిపై చర్యలు తీసుకోవాలంటున్న వైద్యురాలు
రాయదుర్గం అర్బన్‌ : ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు గీతాజ్యోతిని రోగి బంధువులు కళావతి, అశోక్‌లు దూషించిన ఘటనపై కేసు నమోదు కాకుండా పావులు కదులుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధి స్వయంగా కేసు నమోదు చేయండని చెప్పినప్పటికీ జిల్లాకు చెందిన ఓ మంత్రి జోక్యం చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదుకు వెనుకడుగు వేశారు. గురువారం మధ్యాహ్నం రోగి బంధువులు దురుసుగా ప్రవర్తించడంతో మనస్తాపానికి గురైన వైద్యురాలు గీతాజ్యోతితోపాటు మరో వైద్యుడు మన్సూర్‌ అలీఖాన్‌లు ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లారు.

ఇలాంటి వాతావరణంలో తాము వైద్య సేవలదించలేమని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధి స్పందిస్తూ దూషించిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు వైద్యురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన ఏఎస్‌ఐ నారాయణ కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. కాసేపటి తర్వాత మంత్రి వద్ద నుంచి ఫోన్‌ రావడంతో అప్పటికే అదుపులోకి తీసుకున్న అశోక్‌ను సైతం వదిలి పెట్టారు. అశోక్‌ గతంలో మంత్రి వద్ద డ్రైవర్‌గా పనిచేయడం వల్లే మంత్రి జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేడర్‌ను, కార్యకర్తలను రక్షించుకోకపోతే ఎలా అంటూ స్థానిక ప్రజాప్రతినిధికి సైతం సున్నితంగా క్లాస్‌ తీసుకున్నట్లు సమాచారం.

శుక్రవారం ప్రజాప్రతినిధి అత్యవసర పని ఉందంటూ విజయవాడకు వెళ్లగా.. స్థానిక టీడీపీ నాయకులు రాజీకి రావాలంటూ వైద్యురాలిపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చినట్లు తెలిసింది. రాజీయత్నాల కోసం ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి చెందిన ఒకరికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.  ఈ విషయమై వైద్యురాలు గీతాజ్యోతి స్పందిస్తూ తాను రాజీ అయ్యే ఉద్దేశం లేదన్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటే ఇక్కడ పనిచేస్తానని, లేకపోతే వెళ్లిపోతానని స్పష్టం చేశారు. ఎస్‌ఐ మహానంది స్పందిస్తూ రోగి బంధువులు వైద్యురాలికి క్షమాపణ చెప్పామని, కాళ్లు పట్టుకున్నామని చెప్పడంతో కేసు నమోదు చేయలేదని ఇచ్చారు.

మరిన్ని వార్తలు