ఆరోగ్యమంత్రి ముందే వస్తే.. ఇంతమంది చనిపోయేవారా?

4 Aug, 2015 15:26 IST|Sakshi
ఆరోగ్యమంత్రి ముందే వస్తే.. ఇంతమంది చనిపోయేవారా?

కొత్తమాజేరు గ్రామంలో డాక్టర్లున్నా, వాళ్లు మందులు ఇస్తున్నా కూడా జ్వరాలు తగ్గక ఆ జ్వరాలతో జనం పిట్టల్లా రాలిపోతూ మరణిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామంలో వరుసగా సంభవిస్తున్న మరణాలపై స్పందించిన ఆయన.. ఆ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం పర్యటించారు. గత కొన్ని నెలలుగా అక్కడ 18 మంది వరకు మరణించిన వైనంపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు. నాలుగు రోజుల్లోనే ఐదుగురు మరణించినా కూడా.. ఆరోగ్యశాఖ మంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ ఇక్కడకు రాలేదని వాళ్లే వచ్చి ఉంటే పరిస్థితి తీవ్రత గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే.. ఇంతమంది మరణించేవారు కాదని ఆయన అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

  • గ్రామంలో 18 మంది మరణించినా.. ఇక్కడ ప్రజలు చనిపోవడానికి కారణమేంటని ఎవరూ పట్టించుకోలేదు.
  • 11.5.2015న మొదటి మరణం సంభవించింది.
  • అప్పటి నుంచి వెంటవెంటనే ఒకరి తర్వాత ఒకరుగా మరణించారు.
  • ఒకే గ్రామంలో నాలుగు రోజుల్లోనే ఐదుగురు మరణించారు.
  • అయినా ఆరోగ్యశాఖ మంత్రి రాలేదు, ముఖ్యమంత్రీ రాలేదు.
  • అప్పుడే వాళ్లు వచ్చి ఉంటే విచారణ చేసేవారు. విషయం బయటకు వచ్చేది.
  • వెంటనే ఆరోగ్యశిబిరాలు నిర్వహించి ఉంటే ఈ గ్రామంలో ఇంతమంది మరణించేవారు కారు.
  • గంజం జయలక్ష్మి, శ్రీరాములు అనే దంపతులు జూలై 13న జ్వరాలతో మరణించారు.
  • మొదటి మరణం సంభవించిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే.. రెండు నెలల తర్వాత కూడా పరిస్థితి అలాగే ఉంది.. అందుకే వీరు మరణించారు.
  • ప్రభుత్వం ఇచ్చే మందులు పనిచేయవు. కేవలం జ్వరాలతోనే మనుషులు చనిపోతున్నా.. కనీసం మంత్రులు, ముఖ్యమంత్రి లాంటివాళ్లు రారు....
  • ....అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు.


ఈ సమయంలో స్థానికుడు ఒకరు కల్పించుకుని అధికారుల నిష్క్రియాపరత్వం గురించి చెప్పారు. ''ఇక్కడ పరిస్థితి ఘోరంగా ఉందని ఎమ్మార్వోను నిలదీశాం. ఒకపక్కన జ్వరాలు వచ్చి చనిపోతున్నారు, నీళ్లు కలుషితం అయిపోయాయి, ఏం చేస్తారని అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. నీకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లాను. చర్య తీసుకోమని చెబుతామన్నారు. ఎమ్మార్వో కంటితుడుపు చర్యగా ఒక ఏఎన్ఎంని సస్పెండ్ చేశారు తప్ప.. తగిన చర్యలు ఏవీ తీసుకోలేదు. అంత జరిగినా ఏ మంత్రీ ఇక్కడకు రాలేదు. ఎమ్మార్వో అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు తప్ప.. ప్రజలను పట్టించుకోవడం లేదు'' అని ఆయన తన గోడు వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు