రైల్వే స్టేషన్‌లో మిస్‌ఫైర్‌

20 Sep, 2017 22:25 IST|Sakshi
రైల్వే స్టేషన్‌లో మిస్‌ఫైర్‌

– ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్ల కాళ్లలోకి దూసుకెళ్లిన బుల్లెట్‌
– మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలింపు


అనంతపురం న్యూసిటీ: అనంతపురం రైల్వే స్టేషన్‌లో కానిస్టేబుల్‌ చేతిలోని కార్బన్‌ తుపాకీ మిస్‌ఫైర్‌ అయిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌పీఎఫ్‌) హెడ్‌ కానిస్టేబుళ్లు(గుంతకల్లు) రామచంద్ర, రఫి విధి నిర్వహణలో భాగంగా ఈ నెల 19న రాత్రి 12 గంటల సమయంలో హంపి ఎక్స్‌ప్రెస్‌లో అనంతపురం బయలుదేరారు. అనంతపురంలో హంపి ఎక్స్‌ప్రెస్‌ బుధవారం 1.35 గంటల సమయంలో ఆగింది. ఈ క్రమంలో ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు స్టేషన్‌లో ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాం వద్ద దిగారు. రైలు రన్నింగ్‌లో ఉండగానే ఓ వ్యక్తి పరుగెత్తుకుని వస్తూ హెడ్‌ కానిస్టేబుల్‌ రామచంద్రను తగులుతూ రైలెక్కి వెళ్లిపోయాడు.

ఆ ప్రయాణికుడు వేగంగా తగలడంతో రామచంద్ర మరో హెడ్‌కానిస్టేబుల్‌ను తగలగా వీరిద్దరూ కింద పడ్డారు. రామచంద్ర చేతిలో ఉన్న కార్బన్‌ తుపాకీ కింద పడడంతో లాక్‌ ఓపెన్‌ అయ్యి క్షణాల్లో మిస్‌ఫైర్‌ జరిగింది. రామచంద్ర మోకాలు కింద భాగంలో బుల్లెట్‌ దూరి రఫి అనే హెడ్‌కానిస్టేబుల్‌ తొడలోకి దూసుకెళ్లింది. అప్పటికే రామచంద్ర కుప్పకూలిపోయాడు. మిస్‌ఫైర్‌ జరిగి బుల్లెట్‌ లోపలికి వెళ్లిదంటూ బిగ్గరగా కేకలు వేశాడు. రఫి ప్యాంటుకు రంధ్రం పడి ఉండడాన్ని గమనించి తనకూ బుల్లెట్‌ తగిలిందని నిర్ఘాంతపోయాడు. దీంతో అక్కడే ఉన్న ప్రయాణికులు, సిబ్బంది జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటినా ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తరలించారు. అప్పటికే రామచంద్ర శరీరం నుంచి అధికంగా రక్తస్రావం జరిగింది. డ్యూటీ వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. రామచంద్ర కదలలేని స్థితిలో ఉండిపోగా, రఫి బాగానే స్పందిస్తూ ఉన్నాడు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు.

కమాండెంట్‌ పరామర్శ: సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న హెడ్‌కానిస్టేబుళ్లను కమాండెంట్‌ ఎలిషా పరామర్శించారు. వైద్యుల సూచన మేరకు వారిని అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు.

బుల్లెట్ల లెక్కింపు..
ఇద్దరికి గాయాలు కావడంతో ఆర్పీఎఫ్‌ పోలీసులు కార్బన్‌ తుపాకీలో ఉన్న బుల్లెట్లను లెక్చించారు. ఒక్కో కార్బన్‌ తుపాకీలో 30 బుల్లెట్లు ఉంటాయి. రామచంద్ర కార్బన్‌ తుపాకీ పరిశీలించగా అందులో 29 మాత్రమే ఉన్నాయి. దీంతో ఒక బుల్లెట్‌ మాత్రమే బయటకు వచ్చిందని పోలీసులు నిర్థారించారు.

అంబులెన్స్‌ కోసం గంటల తరబడి..
వైద్యులు కర్నూలుకు రెఫర్‌ చేయగా అంబులెన్స్‌ కోసం క్షతగాత్రలు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని అంబులెన్స్‌ పంపాలంటే ఆర్‌ఎంఓ అనుమతి రావాలి. ఆ సమయంలో డ్యూటీ వైద్యులు సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓకు ఫోన్‌ చేయగా వారు 2.30 గంటల సమయంలో గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినా..అంబులెన్స్‌లో డీజిల్‌ లేదు. దీంతో డ్రైవర్‌ డీజిల్‌ లేదంటూ ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోడారు. అంబులెన్స్‌లో డీజిల్‌ వేసుకుని బయలుదేరే సరికి ఉదయం 5.30 సమయం పట్టింది. రాత్రి 1.40 గంటల సమయంలో మిస్‌ఫైర్‌ జరిగితే అంత వరకు కానిస్టేబుళ్లు ఆస్పత్రిలోని క్యాజువాలిటీలో ఉండాల్సి వచ్చిందంటే సర్వజనాస్పత్రిలో వైద్య సేవలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థమవుతోంది. బుల్లెట్‌ శరీరంలో ఉన్నప్పుడు విషంగా మారి ప్రాణానికే ప్రమాదం సంభవించవచ్చు. అటువంటి ప్రభుత్వ సర్వజనాస్పత్రి యాజమాన్యం ముందస్తు ఆలోచన లేకుండా వ్యవహరించడం పలు విమర్శలకు దారి తీసింది.

మరిన్ని వార్తలు