కూతురి మూగవేదన చూడలేక...

14 Jun, 2016 20:34 IST|Sakshi

నార్కట్‌పల్లి : పోలియో, మూగవేదనతో కన్న కూతురు పడుతున్న బాధను చూడలేక కూతురిని చంపి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ తల్లి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు స్థానికుల కథనం ప్రకారం.. మునుగోడు మండల కేంద్రానికి చెందిన నాగరోని వెంకటేశ్వర్లు, కల్పన (అలియాస్) పారిజాత దంపతులకు కుమార్తె సుమశ్రీ (9), ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. సుమశ్రీ పుట్టుకతోనే పోలియో బారిన పడడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అంతే కాకుండా పుట్టు మూగ. ఐదేళ్ల క్రితమే వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కల్పననే వారి ఆలనాపాలన చూస్తోంది. కల్పన మూడేళ్లుగా అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. సుమశ్రీని బాగు చేయించేందుకు ఆమె ఎన్నో ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేదు. ఇటీవల తిరుపతిలో ఆయుర్వేదిక్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లినా నయం కాదని చెప్పాడు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి కల్పన సోమవారం సాయంత్రం కూతురిని తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి నార్కట్‌పల్లి మండలం వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న రైలు పట్టాల వద్దకు చేరుకుంది. రాత్రి తొమ్మిది గంటల వరకు ఒక్క రైలు కూడా రాకపోవడంతో బ్లేడుతో కూతురు గొంతు గోసి, ఆపై తాను కూడా చేయి, గొంతు కోసుకుంది. విషయాన్ని తన మామ బక్కయ్యకు ఫోన్‌లో సమాచారం ఇచ్చింది. వారు 108 కు సమాచారం ఇవ్వగా వారిద్దరిని కామినేని ఆస్పత్రికి తరలించారు. విషమ పరిస్థితిలో ఉన్న సుమశ్రీని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి కల్పన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు