'గవర్నర్ పరోక్షంగా ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు'

24 Jan, 2016 18:52 IST|Sakshi

నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్ భగీరథ పనులపై గవర్నర్ నరసింహన్ సమగ్ర విచారణకు ఆదేశించాలని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ గవర్నర్ మిషన్ భగీరథ పనులను సందర్శించి భేషుగ్గా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి కితాబు ఇవ్వడాన్ని గుత్తా సందేహాలు వ్యక్తంచేశారు. గవర్నర్‌కు ఎన్నికల కోడ్ వర్తించకపోయినా ప్రభుత్వం చేసే పనులను ఎన్నికల సమయంలో మెచ్చుకోవడాన్ని పరోక్షంగా ప్రభుత్వాన్ని సమర్థించినట్లే అవుతుందన్నారు.

గ్రిడ్‌కు ఉపయోగించే పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని, పైపు లైన్ల పనులకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ ను తెప్పించుకుని కంపెనీలతో సంప్రదించి వాస్తవ ధరలను లెక్కకడితే బండారం బయటపడుతుందన్నారు. 30 నుంచి 40 శాతం అధిక ధరలకు పైపులైన్లు కొనుగోలు చేశారని గుత్తా ఆరోపించారు. నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఎన్నికలు సకాలంలో జరగకుండా వాయిదా వేస్తూ సుమారు రూ.300 కోట్లు వెచ్చించి అక్కడ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. ఎన్నికల జాప్యాన్ని ప్రదర్శించడం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం పోషించిన పాత్రను ప్రజలు గుర్తించి జీహెచ్‌ఎంసీ, నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు