-

ముద్రగడ దీక్ష విరమిస్తానన్నారు: వైద్యులు

21 Jun, 2016 12:43 IST|Sakshi
ముద్రగడ దీక్ష విరమిస్తానన్నారు: వైద్యులు

రాజమహేంద్రవరం: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష విరమిస్తానని తమతో చెప్పినట్టు వైద్యులు తెలిపారు. ఈ సాయంత్రం ఆయనను కిర్లంపూడికి తరలిస్తామని, అక్కడే దీక్ష విరమిస్తారని డాక్టర్లు వెల్లడించారు. ముద్రగడ సతీమణి పద్మావతి ఆస్పత్రిలోనే దీక్ష విరమిస్తారని చెప్పారు. దీక్ష విరమణపై ముద్రగడ తరపు నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.

ముద్రగడ డిమాండ్ ప్రకారం తుని ఘటనలో అరెస్ట్ చేసిన 13 మందికి బెయిల్ రావడంతో ఆయన దీక్ష విరమిస్తారని అంటున్నారు. అయితే వారంతా జైలు నుంచి విడుదలైన తర్వాతే దీక్ష విరమిస్తానని ముద్రగడ సోమవారం స్పష్టం చేశారు. 13 రోజులుగా దీక్ష చేస్తున్న ముద్రగడ దంపతుల ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో వారి ఆరోగ్య పరిస్థితిపై కాపు నేతలు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముద్రగడ ఆరోగ్యం విషయంలో టీడీపీ సర్కారు మొదటి నుంచీ పూర్తిగా నిర్లక్ష్యం పదర్శిస్తోందని కాపులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ వచ్చిన వారి విడుదలకు కూడా సహకరించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు