నత్తేనయం !

3 Jun, 2017 01:13 IST|Sakshi
నత్తేనయం !

మూడేళ్లుగా సాగుతున్న నకిరేకల్‌–నల్లగొండ రోడ్డు విస్తరణ  
ఏడాది కాలంగా పనులకు బ్రేక్‌
గడువుముగిసి ఏడాది
ఎక్కడి పనులు అక్కడే..
ప్రమాదకరంగా ప్రయాణాలు

నకిరేకల్‌ : అధికారుల నిర్లక్ష్యమో.. కాంట్రాక్టర్ల పరిహాసమో గానీ రెండేళ్లలో పూర్తికావాల్సిన పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలోని రహదారుల విస్తరణ పనులు నత్త కంటే మిన్నగా సాగుతున్నాయి. రోడ్డు విస్తరణ జరుగుతుందనడంతో ఆనందించిన ప్రజలు, ప్రయాణికులకు నిరాశే మిగులుతోంది. జిల్లాలోని కీలకమైన జాతీయ రహదారిగా మారనున్న నకిరేకల్‌ – నాగార్జునసాగర్‌ రోడ్డు పనులు ప్రారంభమై మూడేళ్లు గడుస్తోంది. అయినా.. నేటికీ సగమైనా పూర్తికాలేదు.

నిత్యం వేల సంఖ్యలో ప్రజలు ఈ రహదారి మీదుగా జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగిస్తారు. అయితే..విస్తరణ పనుల్లో భాగంగా రహదారి మొత్తం తవ్వారు. అక్కడక్కడా కొంత మేరకు ఒక వైపు రోడ్డు నిర్మాణం చేసి మరోవైపు తవ్వడంతో ఎప్పుడు ఏ వాహనం గుంతలో పడుతుందోనని ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ రహదారి మీదుగా ప్రయాణమంటేనే ప్రజలు బిక్కచచ్చిపోయే స్థితి. కానీ తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సివస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డ పనులను పూర్తిచేయాలని పలువురు కోరుతున్నారు.

1. అసంపూర్తిగా నిర్మించిన కల్వర్టు
2. నకిరేకల్‌ – నల్లగొండ మధ్య ఏడాదిగా నిలిచిపోయిన జాతీయ రహదారి విస్తరణ పనులు
3. విస్తరణలో భాగంగా రోడ్డు పక్కన తవ్విన గుంతలు


భూసేకరణ జాప్యంతో పనుల నిలిపివేత
ఈ రహదారి పనులు భూ సేకరణ జాప్యంతో పడకేశాయి. నకిరేకల్‌ నుంచి నాగార్జున సాగర్‌ వరకు జిల్లాలో దాదాపు 86 కిలోమీటర్ల  మేర జాతీయ రహదారి 565 నిర్మాణానికి 2014 మార్చి 13న జీవిఆర్‌ ఇన్‌ఫ్రా అనే కంపెనీ సంస్థకు ఈ విస్తరణ పనులను దక్కించుకుంది. 2016 మార్చి 11వ తేదిలోగా ఈ పనులను పూర్తి చేయాల్సి ఉంది.

పనుల ప్రారంభించి మూడేళ్లు కావస్తున్నా ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా మారాయి. 100 శాతం పనులలో కేవలం 40శాతం మేర పనులు మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 60 శాతం మేర నిర్మాణం పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ మార్గంలో ప్రస్తుతం నల్లగొండ నుంచి హాలియా వరకు రహదారి విస్తరణ పనులు పూర్తి కాగా అధికారుల పర్యవేక్షణ, భూ సేకరణ జాప్యంతో నకిరేకల్‌ నుంచి వయా తాటికల్‌ మీదుగా నల్లగొండ వరకు జరుగుతున్న రహదారి పనులు గతేడాది కాలంగా నిలిచిపోయాయి.

2013లో మంజూరు
జిల్లా నుంచి ఇప్పటికే  హైదరాబాద్‌ – విజయవాడ, హైదరాబాద్‌ – వరంగల్‌ జాతీయ రహదారులు వెళ్తున్నాయి. 2013లో కేంద్ర ప్రభుత్వం మూడో జాతీయ రహదారిని జిల్లాకు మంజూరు చేసింది. మహారాష్ట్రలోని సిరోంచ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రేణుగుంట(తిరుపతి) వరకు మొత్తం 643 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, చిత్తూరు జిల్లాల నుంచి ఈ రహదారి వెళ్తుంది.

సిరోంచ నుంచి వరంగల్‌ వరకు, వరంగల్‌ నుంచి నకిరేకల్, నకిరేకల్‌ నుంచి రేణిగుంట వరకు మొత్తం మూడు విభాగాలుగా దీన్ని విభజించి మూడు జాతీయ రహదారి నెంబర్లు కేటాయించారు. సిరొంచ నుంచి వరంగల్‌ వరకు నిర్మించే రహదారికి 363, వరంగల్‌ – నకిరేకల్‌ వరకు 365, నకిరేకల్‌ నుంచి రేణిగుంట వరకు 565గా విభజించి కేటాయించారు.

ఏడాదిగా నిలిచిన పనులు
ప్రత్యేకించి జిల్లాలోని నకిరేకల్‌ – నల్లగొండ మధ్యలో ఉన్న 565 నెంబర్‌ జాతీయ రహదారి విస్తరణ పనులు భూ సేకరణతో ఏడాది కాలంగా నిలిచిపోయింది. నకిరేకల్‌ నుంచి నాగార్జునసాగర్‌ వరకు 86 కిలో మీటర్ల పొడవున నిర్మించే 565 నెంబర్‌ జాతీయ రహదారి నిర్మాణాఇకి రూ.190 కోట్లు కేటాయించారు.

2014 మార్చిలో జీవిఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థ ఈ పనుల కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. 2016 మార్చి 12 నాటికి 86 కిలో మీటర్ల మేర రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. నల్లగొండ నుంచి హాలియా వరకు మాత్రమే విస్తరణ పనులు పూర్తి చేశారు. నకిరేకల్‌ – నల్లగొండ మధ్యలోని రహదారి వెంట ఉన్న కొందరు రైతులు తమ భూములు కోల్పోతున్న నేపథ్యంలో కోర్టును ఆశ్రయించారు. దీంతో నిర్మాణ పనులకు ఏడాది కాలంగా పూర్తిగా బ్రేక్‌ పడింది.   

ప్రమాదపు అంచున ప్రయాణం
నకిరేకల్‌ నుంచి వయా తాటికల్‌ మీదుగా నల్లగొండకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మొత్తం నకిరేకల్‌ నుంచి వయా తాటికల్‌ మీదుగా పానగల్‌ వరకు 21 కిలో మీటర్ల సింగిల్‌ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి విస్తరణకు శ్రీకారం చుట్టారు. రోడ్డు విస్తరణ అవుతుంది కదా ఇక రాకపోకలు ఎంతో సాఫీగా సాగిద్దామనుకున్న వాహనదారులు, ప్రయాణికుల ఆశలు నెరవేరడం లేదు. ఈ రహదారి మొత్తం పూర్తిగా పెకిలించి నిర్మాణ పనులు ఎక్కడికక్కడే వదిలివేశారు.

దీంతో రోడ్డు పక్కన గుంతలు, కంకర, మట్టి దుమ్ముతో ప్రయాణికులు, వాహనదారులు ఇటుగా వెళ్లాలంటే జంకుతున్నారు. గత వర్షాకాలంలో రోడ్డు వెంట ఉన్న గుంతల్లో నీరు నిలిచి ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో పలువురు ప్రమాదాల బారిన పడిన ఘటనలు లేకపోలేదు. విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో హెచ్చరికల బోర్డులు కూడా నామమాత్రంగా ఏర్పాటు చేశారు. రాత్రి పూట ఒక వైపు తవ్విన రహదారి కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారు.

సత్వరమే పనులు పూర్తి చేయాలి
నకిరేకల్‌ వయా తాటికల్‌ మీదుగా నల్లగొండకు చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులు సత్వరమే పూర్తి చేయాలి. రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ మంది ద్విచక్రవాహనదారులు ఈ రహదారి మీదుగా నల్లగొండకు రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు విస్తరణ పనులతో పూర్తిగా అస్తవ్యస్తంగా మారి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈ విషయంలో సంబంధిత కాంట్రాక్ట్‌ సంస్థ చొరవ చూపి పూర్తి చేయాలి.
– కొండయ్య, తాటికల్, నకిరేకల్‌ మండలం

త్వరలోనే పనులు ప్రారంభిస్తాం
నకిరేకల్‌ – పానగల్‌ మధ్య అసంపూర్తిగా ఉన్న జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రస్తుతం భూ సేకరణ వల్ల పనులు నిలిచిపోయాయి. కొందరు రైతులు భూములు కోల్పోతున్నందున కోర్టును ఆశ్రయించారు. నకిరేకల్‌ నుంచి పానగల్‌ వరకు రోడ్డు వెంట 33 ఫీట్ల వరకు మాత్రమే రోడ్డుకు సంబంధించిన భూమి ఉంది. మిగతా భూమి అంతా ప్రైవేటు వ్యక్తులది. మొత్తం ఈ రహదారి వెంట భూములు కోల్పోతున్న వారికి సుమారుగా రూ.70 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత భూ సేకరణ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రతిపాదించాం. త్వరలోనే ఆమోదం కూడా వస్తుంది. తర్వాత విస్తరణ పనులు ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– ప్రవీణ్‌రెడ్డి, డీఈ, ఎన్‌హెచ్‌ఏఐ, నల్లగొండ

మరిన్ని వార్తలు