ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నాం

20 Oct, 2016 02:34 IST|Sakshi
ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నాం

విలేకరుల సమావేశంలో నారా లోకేశ్

 సాక్షి, నగరంపాలెం (గుంటూరు)/ అమరావతి: మీడియా సహకారంతో తాము రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. ఆయన బుధవారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తన కుటుంబసభ్యుల ఆస్తులు ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... పార్టీలోకి ఎవరు చేరేందుకు వచ్చినా స్వాగతిస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని తెలిపారు. తాను మంత్రివర్గంలో చేరే విషయమై పార్టీ పొలిట్‌బ్యూరో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నానని విపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని తెలిపారు. ఎవరు ఏ కోర్టును ఆశ్రయించినా రాజధాని నిర్మాణం జరిగి తీరుతుందన్నారు. తనకు దేశంలో తప్ప ఎక్కడా బ్యాంక్ అకౌంట్‌లు లేవని తెలిపారు. వెయ్యి, ఐదొందల నోట్లు  రద్దుకు తాము కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధిస్తామన్నారు. తనకు పార్టీ టిక్కెట్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని తెలిపారు. తెలంగాణలో పార్టీ బలంగా ఉందని చె ప్పారు. నవంబర్ ఒకటి నుంచి జనచైతన్యయాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. కాగా రాష్ట్రంలో ఐదారొందల ఓట్లు రాని పార్టీలు పరిశ్రమలను అడ్డుకొమ్మని ప్రజలను రెచ్చగొడుతున్నాయని లోకేష్ విమర్శించారు.

మరిన్ని వార్తలు