అంగన్‌వాడీలకూ సన్నబియ్యం!

13 Nov, 2015 04:07 IST|Sakshi
అంగన్‌వాడీలకూ సన్నబియ్యం!

సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీలకు కూడా సన్నబియ్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా గర్భిణులు, బాలింతలతో పాటు ఆరేళ్లలోపు చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం లభించేలా చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా కానున్నాయి. ప్రస్తుతం అంగన్‌వాడీలకు అందుతున్న కేజీ రూ.4 విలువైన దొడ్డు బియ్యం స్థానంలో కిలో రూ.36.50 విలువైన సన్నబియ్యం(సూపర్ ఫైన్  రకం) అందిస్తారు. దీని ద్వారా రోజుకు రూ.38.45 లక్షల చొప్పున ఏటా రూ.115.34 కోట్ల అదనపు వ్యయం కానుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంచనా. ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

 11లక్షల మందికి మేలు
 రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 35,334 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ కేంద్రాల్లో మొత్తం 11,10,226 మంది లబ్ధిదారులున్నారు. వీరందరికీ అనుబంధ పోషకాహారం నిమిత్తం ప్రతిరోజూ ఒకపూట పూర్తి భోజనాన్ని సర్కారు అందిస్తోంది. ఈ మేరకు అవసరమైన బియ్యం, పప్పు, నూనె.. ఇతర ఆహార పదార్థాలను ఆయా కేంద్రాలకు పౌరసరఫరాల శాఖ ద్వారా అందిస్తున్నారు. అయితే దొడ్డు బియ్యం వల్ల లబ్ధిదారులు ఆహారం తీసుకునేందుకు ముందుకు రావడం లేదని  ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో విద్యార్థి వసతిగృహాలకు ఇస్తున్నట్టుగానే అంగన్‌వాడీలకూ సన్నబియ్యా న్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 రూ.115 కోట్ల అదనపు భారం
 దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందించడం ద్వారా రోజుకు రూ.38.45 లక్షల చొప్పున ఏటా రూ.115.34 కోట్లు అదనంగా ఖర్చుకానుందని అధికారులు అంచనావేశారు.  ప్రస్తుతం అంగన్‌వాడీలకు ఇస్తున్న  కిలో రూ.4 విలువైన దొడ్డు బియ్యానికి నెలకు రూ.1.18 కోట్లు ఖర్చవుతుండగా, సన్నబియ్యం సరఫరా చేస్తే నెలకు రూ.10.79 కోట్లు ఖర్చుకానున్నాయి. ఇలా నెలకు రూ.9.61 కోట్ల చొప్పున  ఏటా రూ.115.34 కోట్లు అదనపు భారం పడనుందని అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు