నీరు పారాలంటే ‘టెస్ట్’ నెగ్గాల్సిందే! | Sakshi
Sakshi News home page

నీరు పారాలంటే ‘టెస్ట్’ నెగ్గాల్సిందే!

Published Fri, Nov 13 2015 4:10 AM

నీరు పారాలంటే ‘టెస్ట్’ నెగ్గాల్సిందే!

సాక్షి, హైదరాబాద్: నీటి సరఫరా పనుల్లో పైప్‌లైన్ కీలకం. పైప్‌లైన్లలో పగుళ్లు రాకుండా పరీక్షలు చేపట్టాలి. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులపై చేపడుతున్న ప్రాజెక్టుల పనుల్లో ఇటీవల పైప్‌లైన్ పగలడం నిత్యకృత్యమైంది. హైదరాబాద్‌లో కృష్ణా ఫేజ్-2లో పనులు పూర్తయిన తర్వాత పైప్‌లైన్ పగిలి తీవ్ర నష్టాన్ని కలిగించిన ఘటన మరవకముందే వరంగల్ జిల్లాలో దేవాదుల పైప్‌లైన్ పగిలి పంట నష్టం సృష్టించింది. 5 టీఎంసీల కృష్ణా నీటిని జంట నగరాల తాగునీటికి పంపింగ్ చేస్తున్న తరుణంలో 2.5 కి.మీ. దూరంలో 47 చోట్ల లీకేజీలను అధికారులు ఇటీవల గుర్తించారు. పైప్‌లైన్లు బద్ధలైనప్పుడల్లా సస్యశ్యామలైన భూమి మరుభూమిగా మారుతోంది. పలిగిన పైప్‌లైన్‌ను సరిచేసి నీటిని పంపింగ్ చేయడానికి సమయం పడుతుండటంతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది.

ప్రస్తుతం తెలంగాణ, ఏపీల్లో పూర్తిగా ఎత్తిపోతల పథకాలే చేపడుతుండటం, వాటిల్లో ఎక్కువగాపైప్‌లైన్ నిర్మాణాలే ఉండటంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నీటిపారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ ఈఎన్‌సీ టి.హనుమంతరావు సూచిస్తున్నారు. వాటిని కచ్చితంగా పాటిస్తేనే ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. వీటితోపాటే పరీక్షలన్నీ జరుగుతున్నవి నిజమైతే పగుళ్లు ఎందుకు జరుగుతున్నాయో కారణాలను ప్రభుత్వం విశ్లేషించాలని అంటున్నారు. పైప్‌లైన్ నిర్మాణం, పరీక్షలపై ఇంకా ఆయన ఏం చెప్పారంటే...

 హైడ్రాలిక్ పరీక్ష తప్పనిసరి
 ప్రాజెక్టుల్లో వాడే పైపులను ముందుగా పరీక్షించాల్సి ఉన్నా అది జరగట్లేదు. సాధారణంగా పైపుల తయారీలో 3 మీటర్ల వ్యాసం ఉన్న స్టీలు ప్లేటును తెచ్చి పైపు రూపంలోకి మారుస్తారు. దాన్ని వెల్డింగ్ చేసిన తర్వాత రేడియోగ్రఫీ పరీక్ష చేస్తారు. అతుకులు సరిగా ఉన్నాయా? లేదా? అన్నది ఈ పరీక్షలో తేలుతుంది. ఇబ్బందులుంటే రీ వెల్డింగ్  చేయాలి. పైపు తయారీ తర్వాత ‘హైడ్రాలిక్ ప్రెషర్ పరీక్ష’ జరపాలి. పైపును పూర్తిగా నీటితో నింపి ప్రెషర్ పెట్టాలి. ఇలా 2 గంటల పాటు పైపులో లీకేజీలు లేకుండా ఉండాలి. వాస్తవంగా పైప్‌లైన్ పనిచేస్తున్నప్పుడు ఉండే వర్కింగ్ హెడ్‌కు రెట్టింపు ఒత్తిడితో దీన్ని పరీక్షించాలి. దీన్ని క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది పరిశీలించాలి.

 రెట్టింపు ఫ్రెషర్ పరీక్షే ముఖ్యం
 నిర్మాణం చేసే ప్రాంతానికి పైపులు తెచ్చి జాయింట్ చేసే సమయంలోనూ ప్రతి అర కిలోమీటర్‌కు జాయింటింగ్ పరీక్ష చేయాలి. పైప్‌లైను ఇరువైపులా మూసివేసి నీళ్లతో నింపి ప్రెషర్ పరీక్ష చేయాలి. నిర్ధారిత ప్రెషర్‌కన్నా ఎక్కువ ప్రెషర్‌తో పరీక్షించాలి. రెండు గంటల పాటు ఎలాంటి లీకేజీలు లేకుండా ఉండాలి.

 ఇక ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ 3114 మేరకు.. కరెంట్ పోయినప్పుడు మోటార్లు నిలిచిపోవడంతో వాటర్ హమ్మర్ ప్రెషర్ ఉంటుంది. దీన్ని సైతం వర్కింగ్ హెడ్‌లో కలిపి తీసుకోవాలి. వర్కింగ్ హెడ్‌లో స్టాటిక్ హెడ్, ప్రిక్షనల్ హెడ్ కలసి ఉంటాయి. దీనికి అదనంగా వాటర్ హమ్మర్ హెడ్ కలిపితే వచ్చేది గరిష్ట వర్కింగ్ హెడ్. దీనికన్నా ఫ్రెషర్ టెస్ట్ రెండింతలుగా ఉండాలి (ఉదాహరణకు 50 మీటర్ల స్టాటిక్ హెడ్, 50 మీటర్ల ప్రిక్షనల్ హెడ్, 100 మీటర్ల హమ్మర్ హెడ్ ఉన్నట్లయితే వీటికి రెట్టింపుగా అంటే 200 మీటర్ల గరిష్ట వర్కింగ్ హెడ్ ఉంటుంది. అలాంటప్పుడు ప్రెషర్ టెస్ట్ 400 మీటర్లకు చేయాలి). దీంతోపాటే ట్రయల్న్‌ల్రో భాగంగా పంపింగ్ మిషన్, మోటార్ సామర్థాన్ని పరిశీలించాలి. పవర్ ఫ్యాక్టర్ అదుపులోనే ఉందా? వాల్వ్‌లు ఎలా పనిచేస్తున్నాయో నిర్ధారించుకోవాలి.
 
 శిక్షలు.. పరిహారం
  లీకేజీలతో ప్రజానష్టం జరిగితే దక్షిణకొరియా వంటి దేశాల్లో బాధ్యులైన అధికారులకు, కాంట్రాక్టర్లకు జైలు శిక్ష విధించే నిబంధనలు ఉన్నాయి. బాధితులకు కాంట్రాక్టర్ల నుంచి పరిహారం ఇప్పించేలా చట్టాలున్నాయి. మన రాష్ట్రంలోనూ లీకేజీలకు కారణమైన వారిపై చర్యలుండాలి. అప్పుడే వారంతా పకడ్బందీగా చర్యలు తీసుకుంటారు.

Advertisement
Advertisement