22 నుంచి జాతీయస్థాయి సాంఘిక నాటిక పోటీలు

19 Dec, 2016 23:53 IST|Sakshi
22 నుంచి జాతీయస్థాయి సాంఘిక నాటిక పోటీలు
కర్నూలు(టౌన్‌): తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ ఉత్తర అమెరికా (తానా) ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి 24 వరకు స్థానిక సి.క్యాంపులోని టి.జి.వి. కళాక్షేత్రంలో జాతీయ స్థాయి సాంఘిక నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాక్షేత్రం చైర్మన్‌ టి.జి. భరత్‌ వెల్లడించారు. సోమవారం స్థానిక మౌర్య ఇన్‌లోని పరిణయ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. 22 వ తేదీ సాయంత్రం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలన, 7 గంటలకు సభా కార్యక్రమం ఉంటుందన్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి,  రాజ్యసభ సభ్యులు టి.జి. వెంకటేష్, రాయలసీమ ఐజీ శ్రీధర్, జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ శివకోటిబాబురావు,  జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌తోపాటు తాను కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో 9 టీమ్‌లు    పోటీల్లో పాల్గొంటాయన్నారు. ప్రతిరోజు మూడు టీమ్‌లు మూడు రోజుల పాటు నాటికలను ప్రదర్శిస్తారన్నారు. 24న ముగింపు రోజు ఉత్తమ నాటిక ప్రదర్శన, బహుమతి ప్రదానం, హైదరాబాదు వారిచే సంగీత విభావరి ఉంటుందని తెలిపారు. ముగింపు కార్యక్రమంలో సిని నటుడు, యువ హీరో నిఖిల్, మిమిక్రీ కళాకారుడు రమేష్, అమెరికా నుంచి తానా అధ్యక్షులు చౌదరి జంపాల, సతీష్‌ వేమన, సంయుక్త కార్యదర్శి రవి పోట్లూరి, గోగినేని శ్రీనివాసు హాజరవుతున్నట్లు  తెలిపారు. సమావేశంలో కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, తానా కో-ఆర్డినేటర్‌ ముప్పా రాజశేఖర్‌ పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు