‘శిక్ష’ణకు సడలింపు !

12 Sep, 2017 10:37 IST|Sakshi
‘శిక్ష’ణకు సడలింపు !

నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ప్రైవేట్‌ టీచర్లకు ట్రైనింగ్‌
ఉపాధ్యాయ అభ్యర్థి ఇంటి వద్దకే ‘డిజిటల్‌ తరగతులు’
జిల్లాలో 110 పాఠశాలలకు నిబంధనలు వర్తింపు
ప్రైవేట్‌లో ‘అసలు’ లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వ కమిటీలు


నాణ్యమైన విద్యనందించే అవకాశం
ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు టెట్‌ను మినహాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నిర్ణయం ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శుభ పరిణామం. ఓపెన్‌ స్కూలింగ్‌ శిక్షణ ద్వారా పిల్లలకు నాణ్యతతో కూడిన విద్యను అందించే అవకాశం ఉంటుంది.– సానికొమ్ము బ్రహ్మారెడ్డి, ప్రైవేట్‌ పాఠశాలల సంఘం జిల్లా అధ్యక్షుడు

కొత్తగూడెం :
ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు కూడా ‘టెట్‌’ తప్పనిసరి అని ఇటీవల పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధనను సడలించింది. కేంద్ర, రాష్ట్ర ప్రైవేట్‌ పాఠశాలల అసోసియేషన్‌ల వినతి మేరకు టెట్‌ నిబంధనను తొలగించి 2019 మార్చి 31 లోపు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ ద్వారా ట్రైనింగ్‌ పూర్తి చేయాలని పేర్కొంది. దీంతో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఊపిరి పీల్చుకున్నాయి. కాగా, జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలలు.. వాటిలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య గురించి ఆయా పాఠశాలల యాజమాన్యాలు తెలిపే వివరాలు వాస్తవానికి భిన్నంగా ఉండడంతో ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి ‘అసలు’ లెక్క తేల్చాలని నిర్ణయించింది.

శిక్షణ, నాణ్యత తప్పనిసరి..
ఇటీవలి కాలంలో ప్రైవేట్‌ పాఠశాలలు బాగా విస్తరిస్తున్నాయి. పోటీ పరీక్షల కోసం ప్రత్యేక విభాగాలుగా పేర్కొంటూ చిన్న తరగతుల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా అధిక ఫీజులను వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఫీజులు  భారీగానే తీసుకుంటున్నప్పటికీ కొన్ని పాఠశాలల్లో పది, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారితోనే పాఠాలు చెప్పిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. విద్యాహక్కుచట్టం  ప్రకారం ఒకటి నుంచి 8వ తరగతి వరకు పాఠాలను భోదించే ఉపాధ్యాయులు తప్పనిసరిగా శిక్షణ పూర్తి చేసి ఉండాలి. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా టెట్‌ను తప్పనిసరి చేయాలని భావించింది.

కానీ పాఠశాలల్లో దీర్ఘకాలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉండటంతో పాటు పదో తరగతి, ఇంటర్‌ అర్హతతోనే కొనసాగే వారు అనేక మంది ఉన్నారు. టెట్‌ నిర్ణయాన్ని అమలు చేస్తే అనేక మంది, వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని జాతీయ, రాష్ట్ర ప్రైవేట్‌ పాఠశాలల సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం టెట్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. అన్‌ట్రైన్డ్‌ టీచర్లకు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో డిజిటల్‌ తరగతులు నిర్వహించి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.

జిల్లాలో 110 పాఠశాలల్లో శిక్షణ...
 జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాఠశాలలు 110 ఉన్నాయి. వీటిలో 2900 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా ప్లే స్కూల్స్‌ చిన్నారులు కాకుండా సుమారు 50 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2900 మంది ఉపాధ్యాయులలో సుమారు 60 శాతం అన్‌ట్రైన్డ్‌ వారే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో 2019 మార్చి 31 నాటికి అన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో ట్రైనింగ్‌ టీచర్లు అందుబాటులోకి రానున్నారు. కాగా వీరంతా ఈనెల 15లోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే వ్యవధి చాలా తక్కువగా ఉండటంతో గడువు పొడిగించాలని ప్రైవేట్‌ యాజమాన్యాలు వేడుకుంటున్నట్లు  తెలిసింది.

ఉపాధ్యాయ అభ్యర్థి ఇంటి వద్దకే డిజిటల్‌ తరగతులు...
నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ ద్వారా రెండేళ్ల పాటు నిర్వహించే ఈ శిక్షణను ఉపాధ్యాయ అభ్యర్థి తన ఇంటి వద్దనే డిజిటల్‌ తరగతుల ద్వారా నేర్చుకుంటారు.  ఇంటర్‌ పూర్తి చేసిన వారు, పదో తరగతి ఉత్తీర్ణులయి ఓపెన్‌ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ శిక్షణకు అర్హులు. రెండేళ్ల తర్వాత జిల్లా కేంద్రంలో పరీక్షలు  నిర్వహించి ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ అందజేస్తారు. రెండేళ్ల శిక్షణకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 6 వేలు ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో రూ.4500 ఫీజుగా, రూ.1500 విలువైన సెట్‌అప్‌ బాక్స్‌ను అభ్యర్థికి అందిస్తారు. తద్వారా ఇంటి వద్దనే నిర్దేశిత సమయం ప్రకారం డిజిటల్‌ తరగతుల ద్వారా శిక్షణ పూర్తి చేసేలా ఎన్‌ఈఓఎస్‌ ప్రణాళిక రూపొందించింది. దీని ప్రకారం పదో తరగతి అర్హతతో ప్రైవేట్‌ పాఠశాలల్లో భోదించే ఉపాధ్యాయులు ఇక ఇంటి దారి పట్టాల్సిందే.

 ‘అసలు’ లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వ కమిటీలు...
ఇప్పటి వరకు డీఈఓ కార్యాలయంలో ప్రైవేట్‌ పాఠశాలలు, వాటి వివరాలు ఉండేవి. అనేక పాఠశాలల్లో ట్రైన్డ్‌ ఉపాధ్యాయులు లేకపోయినా ఉన్నట్లుగా లెక్కలు చూపి పాఠశాలలను నడుపుతున్నట్లు ఆరోపణలు  ఉన్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో పది, ఇంటర్‌ పూర్తి చేసిన ఉపాధ్యాయులతోనే అనేక పాఠశాలలు నడుస్తున్నట్లు విద్యాశాఖ భావిస్తోంది. దీంతో అసలు ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉన్న ఉపా«ధ్యాయులు, వారి విద్యార్హతలతో పాటు ట్రైన్డ్‌ టీచర్ల లెక్కను తేల్చాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రతి మండలంలో ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులతో కమిటీలు ఏర్పాటు చేసి ‘అసలు’ లెక్కలను తేల్చేందుకు కసరత్తు చేస్తోంది.

మరిన్ని వార్తలు