దేశంలో క్రీడలపై చిన్నచూపు

22 Aug, 2016 22:53 IST|Sakshi
మాట్లాడుతున్న ఒలింపిక్‌ సంఘ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌

 ప్రభుత్వాల తీరుకు ప్రజాప్రతినిధిగా సిగ్గుపడుతున్నా
 జిల్లా ఒలింపిక్‌ సంఘ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ వ్యాఖ్య
ఒక్కో పాఠశాలకు క్రీడలకోసం రూ.లక్ష కేటాయించాలి: ఎమ్మెల్సీ గాదె
ప్రారంభమైన మూడు రోజుల జిల్లాస్థాయి సెమినార్‌


శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రపంచంలో అత్యధిక మానవ వనరులు కలిగిన మన దేశంలో ఇప్పటికీ క్రీడలపై ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తుండడం బాధాకరమని జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, జిల్లా పీఈటీ సంఘ గౌరవాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. కనీస నిధులు కేటాయించకుండా క్రీడలపై ప్రభుత్వాలు అవలంభిస్తున్న తీరు, విధానాలపై ప్రజాప్రతినిధిగా సిగ్గుపడుతున్నానని వాపోయారు. జిల్లా పీడీ, పీఈటీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో సోమవారం ప్రారంభమైన మూడు రోజుల జిల్లాస్థాయి వ్యాయామోపాధ్యాయుల సెమినార్‌ కమ్‌ వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తెలుగుతేజం సింధూను అభినందించారు.

ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతూ వేలాది కోట్లు ఖర్చుపెట్టే ప్రభుత్వాలు..  వ్యాయామం, క్రీడలతోనే ఆరోగ్యం సాధ్యపడుతుందన్న విషయాన్ని గుర్తించలేకపోవడం బాధాకరమన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకిS వస్తే రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాంద్ర ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ క్రీడాకారులు పతకాలు సాధించి తెచ్చిన తర్వాత ఇచ్చే ప్రోత్సాహాకాలను, క్రీడాకారులు తయారుచేసే సమయంలో కేటాయింపు చేస్తే ఎంతో మంది ఒలింపియన్లను తయారుచేయవచ్చన్నారు. ప్రతి జిల్లాకు ఒక స్పోర్ట్స్‌ స్కూల్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి హైస్కూల్‌కు క్రీడల నిర్వహణ, క్రీడా పరికరాల కోసం తక్షనమే రూ.లక్ష చొప్పున కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాకుళం మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఎం.వి.పద్మావతి మాట్లాడుతూ క్రీడలతోనే దేశం గుర్తింపు పొందుతుందన్నారు.

డీఈఓ డి.దేవానందరెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి పీడీ, పీఈటీలకేనని అన్నారు. విద్యార్థులను క్రీడాకారులగా మలచాలని పిలుపునిచ్చారు. ఆర్‌ఎంఎస్‌ఏ డిప్యూటీ ఈఓ ఎ.ప్రభాకరరావు మాట్లాడుతూ ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా క్రీడల దినోత్సవానికి రూ.50వేల నిధులు జిల్లాకు వచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్‌వీఎం పీఓ త్రినాథరావు, డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్‌కుమార్, రాష్ట్ర పీఈటీ సంఘం అధ్యక్షులు బి.కరిముల్లారావు, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, జిల్లా డిప్యూటీ విద్యాధికారులు వి.ఎస్‌.సుబ్బారావు, బి.సత్యనారాయణమూర్తి, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.బాబూరావు, జిల్లా ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి పి.సుందరరావు, జిల్లా పీఈటీ సంఘ ముఖ్య ప్రతినిధులు వై.పోలినాయుడు, ఎం.సాంబమూర్తి, కె.రాజారావు, వెంకటరమణ, ఎస్‌.సూరిబాబు, శేఖర్, హరిబాబు తదితరులు ప్రసంగించారు. అనంతరం పీఈటీలకు పలు అంశాల్లో అవగాహన కల్పించారు.


పీఈటీలుగా గుర్తించండి
కస్తూరిబా విద్యాలయాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8.30 వరకు హాస్టల్‌ వార్డెన్ల మాదిరిగా పనిచేస్తున్న పీఈటీలను గుర్తించాలంటూ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడుకు విన్నవించారు. విద్యాలయాల్లో తమను పీఈటీలుగా పరిగణించడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో రమణమ్మ, దీపిక, నీరజ, భారతి, సన్యాసమ్మ, తదితరులు ఉన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా