సోషల్‌ మీడియా స్టార్‌గా మారిపోయిన మిస్టరీ గర్ల్‌.. మనోళ్లు అంటే ఎంతిష్టమో!

18 Nov, 2023 10:32 IST|Sakshi

వినూత్నంగా ఆలోచించేవారు నలుగురిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. సందర్భం ఏదైనా తమదైన శైలితో కోట్లమందిలోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ప్రస్తుతం వాజ్మా అయూబీ కూడా ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుని స్టార్‌ అభిమానిగా ట్రెండ్‌ అవుతోంది. 
 

రేపటి ఫైనల్‌ మ్యాచ్‌తో ముగియనున్న వరల్డ్‌ కప్‌లో ఇండియా టీమ్‌ ఆడిన ప్రతి మ్యాచ్‌లో విజయకేతనం ఎగరవేసి, దాదాపు కప్పు ఇండియాదే అని చెప్పకనే చెబుతూ.. ప్రపంచ క్రికెట్‌ అభిమానుల్ని తనవైపు తిప్పుకుంది. ఇండియా టీమ్‌కు మద్దతు తెలుపుతూ అభిమానుల చూపులు తనపై నిలుపుకుని సోషల్‌ మీడియా స్టార్‌గా మారింది వాజ్మా అయూబీ.

అఫ్ఘనిస్తాన్‌కు చెందిన 28 ఏళ్ల వాజ్మా అయూబీకి రేపు జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌పైనే అందరి కంటే ఇంకాస్త ఎక్కువ ఆసక్తి. ప్రత్యర్థి టీమ్‌ అయిన భారత్‌ జట్టు గెలుపును ఆకాంక్షిస్తూ పోస్టులు పెట్టడం ద్వారా మన వాళ్లందరి అభిమానాన్నీ చూరగొంది ఈ సుందరి. ఉత్తర ఆఫ్ఘన్‌ ప్రావిన్స్‌లోని కుందుజ్‌లో పుట్టింది వాజ్మా. చిన్నతనంలో కుటుంబం అమెరికా వెళ్లడంతో కొలరాడోలోనే పెరిగింది.

స్కూలు విద్యాభ్యాసం అయిన తరువాత  గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ లీడర్‌ షిప్‌లో మాస్టర్స్‌ చేసింది. ప్రస్తుతం దుబాయ్‌లో వ్యాపారవేత్తగా రాణిస్తోంది. ఫ్యాషన్‌ మీద ఆసక్తితో ‘లామన్‌’ పేరుతో క్లాత్‌ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్టర్‌గా కూడా రాణిస్తోంది. ఒక పక్క తన వ్యాపారంతో పాటు ఒక్కగానొక్క కొడుకుని చూసుకుంటూనే చైల్డ్‌ఫండ్‌ ప్రచార కర్తగా, సామాజిక కార్యకర్తగా పనిచేస్తోంది. 

మిస్టరీ గర్ల్‌... క్రికెట్‌ను ఆరాధించే వాజ్మా గతేడాది జరిగిన టీ20 ఆసియా కప్‌లో తొలిసారి మెరిసింది. అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు హాజరై స్టేడియంలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ మ్యాచ్‌ను టీవీల్లో చూసినవారు కూడా ఎవరీ ఈ అందాల రాశి అంటూ ఆసక్తిగా చూశారు. ఆ తరువాత ఈ మ్యాచ్‌లో గెలిచిన అఫ్ఘానిస్థాన్‌కు ‘‘కంగ్రాట్స్‌ బ్లూ టైగర్స్‌’’ అని అప్పట్లో ట్విటర్‌లో పోస్టుపెట్టింది. ఆ పోస్టు క్షణాల్లో వైరల్‌గా మారింది. అప్పటిదాకా మిస్టరీ గర్ల్‌గా ఉన్న వాజ్మా అందమైన క్రికెట్‌ అభిమానిగా క్రికెట్‌ ప్రపంచానికి పరిచయం అయింది. 

ఈ ఏడాది సెప్టెంబర్‌లో విరాట్‌ కోహ్లి సంతకం చేసిన జెర్సీ వేసుకుని స్టేడియంలో కనిపించింది. ఆ రోజు జరిగిన మ్యాచ్‌లో అప్ఘాన్‌ టీమ్‌పై విరాట్‌ కోహ్లీ సెంచరీ కొట్టాడు. సొంత టీమ్‌ కాకుండా ప్రత్యర్థి టీమ్‌కు మద్దతు తెలపడం చిత్రంగా అనిపించింది. అప్పటి నుంచి ఇండియా టీమ్‌ అభిమానిగా సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తోంది వాజ్మా.

ప్రస్తుతం వరల్డ్‌కప్‌ చూసేందుకు ఇండియా వచ్చిన వాజ్మా సొంత టీమ్‌ కాకుండా ఇండియా టీమ్‌కే సపోర్ట్‌గా నిలుస్తూ సోషల్‌ మీడియా స్టార్‌ అభిమానిగా మారింది. విరాట్‌ కోహ్లీ, మొహమ్మద్‌ షమీకి వీరాభిమాని అయిన వాజ్మా ఇటీవల మ్యాచ్‌లో మొహమ్మద్‌ షమీ తీసిన ఏడు వికెట్లకు తెగ సంబరపడి పోయి షమీని అభినందనలతో ముంచెత్తింది. ఒక ఆఫ్ఘనీ అమ్మాయి అయ్యిండి ఇండియా టీమ్‌ను ఫేవరెట్‌గా భావిస్తూ స్టార్‌ అభిమానిగా పాపులర్‌ అయ్యింది.
 

మరిన్ని వార్తలు